తెదేపా నేతల అరెస్టులను నిరసిస్తూ.. ఆ పార్టీ నేతలు ధర్నాకు దిగారు. అధికార పార్టీ నేతలు కక్ష పూరితంగా వ్యవహరిస్తూ.. ప్రజల తరపున పోరాడకుండా విపక్షాలను నిలువరించాలని చూస్తున్నారని నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
అనంతపురం జిల్లాలో...
ప్రజాస్వామ్య పద్ధతిలో చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకోవడంపై తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. శాంతియుతంగా ధర్నా చేయడానికి యత్నించిన నేతల అక్రమ అరెస్ట్‌లను వ్యతిరేకిస్తూ.. అనంతపురం జిల్లా కదిరిలో పార్టీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా.. 42 వ జాతీయ రహదారిపై అంబేద్కర్ కూడలిలో నినాదాలు చేశారు. రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన అధికారులు.. పాలకుల ఒత్తిడికి లోనై విపక్షాలపై కక్షసాధింపు ధోరణిలో వ్యవహరించడం సరికాదన్నారు.
చిత్తూరు జిల్లాలో...
దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులు, దాడులకు.. తేదేపా నాయకులు, కార్యకర్తలు భయపడే ప్రసక్తి లేదని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ అన్నారు. తమ పార్టీ నేతల అరెస్టును నిరసిస్తూ.. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని అన్నమయ్య కూడలిలో ధర్నాకు దిగారు. దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ఆపలేని ప్రభుత్వం.. అడ్డుకోవాలని చూస్తున్న తెదేపా నాయకులపై కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. చేతనైతే ప్రజలకు సుపరిపాలన అందించాలి కానీ ఇలాంటి చర్యలకు పాల్పడటం హేయమన్నారు. రాష్ట్రంలో 65 లక్షల మంది పార్టీ కార్యకర్తలు ఉన్నారని.. అందరిపైనా కేసు నమోదు చేసి జైళ్లలో పెట్టడం సాధ్యం కాదన్నారు. ఇకనైనా కక్ష సాధింపు చర్యలు మాని.. అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఇదీ చదవండి: చెరువు ముందర తండా మారమ్మ ఆలయంలో హుండీ చోరీ..