ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడిపత్రి ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని తెదేపా అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే త్వరలో తెదేపా మిత్రపక్ష పార్టీలతో కలిసి ఛలో తాడిపత్రి నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. తాడిపత్రిలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని తెదేపా, సీపీఐ నేతలు సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన విమర్శించారు.
మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి ఇంటిపై వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు దాడిచేసిన ఘటనను తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు. దాడిచేసిన పెద్దారెడ్డిపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు.. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలపై కేసు పెట్టడం ఏంటని కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష నేతలను బెదిరించాలని చూస్తోందని అన్నారు. ప్రజలు వీటన్నింటిని గమనిస్తున్నారని.. వైకాపా ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్ మండిపడ్డారు. పోలీసుల వైఫల్యం కారణంగానే జిల్లాలో ఒక్కరోజే మూడు సంఘటనలు చోటుచేసుకున్నట్లు ఆయన ఆరోపించారు.
ఇదీ చదవండి: