అనంతపురం జిల్లాలో పోలీసు అమర వీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కొన్ని చోట్ల ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా మరి కొన్ని చోట్ల రక్తదానం, సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టారు.
అనంతపురంలో
అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా అనంతపురంలో పోలీసులు, విద్యార్థులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సత్య బాబు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో అమరవీరులకు జై కొడుతూ ర్యాలీ సాగింది.
పెనుకొండలో
పోలీసులు అమర వీరుల త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని పెనుకొండ డీఎస్పీ మహబూబ్ భాషా తెలిపారు. సమాజ సేవలో నిత్యం ఉంటూ విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీసు వీరులకు మా జోహర్లు అని అన్నారు. వారి త్యాగాలకు గుర్తుగా రక్తదానం, రన్నింగ్, సమాజ సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు.
హిందూపురంలో
అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ హిందూపురంలో పోలీసులు 5కె రన్‌ను నిర్వహించారు . రన్ ఫర్ యూనిటీ పేరిట కొనసాగిన 5కె రన్ ఒకటవ పట్టణం పోలీసుస్టేషన్ నుంచి పట్టణంలోని ప్రధాన కూడళ్ల మీదుగా రహమత్‌పురం కూడలి వరకు కొనసాగింది. అమరవీరులకు నివాళులు అర్పించారు.
బుక్కరాయసముద్రంలో
పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా బుక్కరాయసముద్రంలోని మార్కండేయ స్వామి దేవాలయం వద్ద నుంచి జంతులూరు వరకు 14 వ బెటాలియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. విధి నిర్వహణలో భాగంగా ప్రాణాన్ని ఫణంగా పెట్టి మరణించిన అమర వీరులను స్మరించుకోవడం మన బాధ్యత అని ఏపీఎస్పీ కమాండెంట్ బత్తుల శ్రీరామమూర్తి తెలిపారు. పోలీసుల విధి విధానాలను ప్రజలకు తెలియజేయడం కోసమే ఈ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు.
మడకశిర సర్కిల్లో
పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మడకశిర సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో 1కే రన్ నిర్వహించారు. పట్టణంలోని జూనియర్ కళాశాల నుంచి డిగ్రీ కళాశాల వరకు ఒక కిలోమీటరు పరుగును నిర్వహించారు. అందులో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
ఇదీ చదవండీ...మీలో ఆశే.. సైబర్ నేరగాళ్లకు అవకాశం!