డిసెంబర్ 23 నుంచి సంక్రాంతి పండగ వరకు జగనన్న కాలనీ(Jagananna Colonies)ల్లో పట్టాల పంపిణీ ఉంటుందని గృహ నిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. అనంతపురంలో గృహ నిర్మాణశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన అజయ్ జైన్ మీడియాతో మాట్లాడుతూ ఇంటి పట్టాలపై లబ్దిదారులకు పూర్తి హక్కులు బదిలీ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు చెప్పారు. గ్రామ సచివాలయాల్లోనే లబ్దిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. లక్ష 10 వేల కోట్ల రూపాయలతో జగనన్న కాలనీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తొలి విడతలో 15 లక్షల మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశామని, రెండో విడతలో మరో 13 లక్షల ఇంటి స్థలాలు ఇస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల లేఔట్లు ఏర్పాటు చేసి, పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసినట్లు చెప్పారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం 34 వేల కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నట్లు అజయ్ జైన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కుప్పం పోలీసుల తీరుపై ఎస్‌ఈసీకు వర్ల రామయ్య ఫిర్యాదు