ఉన్నత చదవులు. లక్షల్లో జీతాలు. అయినా ఆ ఉద్యోగాన్ని వదులుకొని వ్యవసాయం బాట పట్టాడో యువకుడు. ఇంకో వ్యక్తి..వర్క్ ఫ్రం హో చేస్తూ..ఖాళీ సమయంలో వ్యవసాయం చేస్తున్నాడు. వీరిద్దరూ పెద్ద మొత్తంలో ఆర్జిస్తూ..అందరికీ ఆదర్శంగా నిలిచారు.
అనంతపురం జిల్లా గోరంట్ల మండలం నార్సింపల్లికి చెందిన మణిభూషణ్ రెడ్డి సాఫ్ట్ వేర్ ఉద్యోగి. కరోనా వల్ల స్వగ్రామం చేరాడు. ఇంటి నుంచే ఉద్యోగం చేస్తున్నాడు. ఖాళీ సమయంలో వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. సాంప్రదాయ పద్ధతిలో కాకుండా ఆధునిక విధానంలో వ్యవసాయం చేస్తూ అధిక లాభాల్ని గడిస్తున్నాడు. రాబోయే రోజుల్లో సేంద్రియ పద్ధతిలో పంటల సాగు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపాడు.
అదే మండలం మరో గ్రామం ఎర్రబల్లికి చెందిన మంజునాథ్ రెడ్డి ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగంలో చేరాడు. కొన్నాళ్లయ్యాక సొంతంగా వ్యాపారం పెట్టుకున్నాడు. కరోనా వల్ల స్వగ్రామంలో ఉంటూ వ్యవసాయం వైపు దృష్టిసారించాడు. ఏకంగా 10 ఎకరాల్లో బొప్పాయి, ఐదెకరాల్లో ద్రాక్ష, 10 ఎకరాల్లో టమోటా, ఒకటిన్నర ఎకరా లో క్యాప్సికం సాగు చేశాడు. అనుభవలేమి కారణంగా మొదట్లో ఆశించిన దిగుబడి రాక నష్టాలను చవి చూశాడు. అయినా వెనకడుగు వేయకుండా నిపుణుల సలహాతో ముందడుగు వేసి విజయం సాధించారు. "వ్యవసాయంలో ఒడిదొడుకులు ఉండడం సహజం. అయితే వ్యవసాయాన్ని వ్యాపారంగా పరిగణించి ఇందులోకి రావద్దు" అని అభిప్రాయపడ్డాడు. "వ్యవసాయంలో ఒంటరిగా ఉంటే కష్టమని.. అవసరమైన కూలీలకు నైపుణ్యాలు నేర్పితే మంచి ఫలితాలు సాధించవచ్చు అంటున్నాడు" ఈ యువ రైతు.
ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ వృత్తి .. వ్యవసాయం ప్రవృత్తి