Father and Son Die Due to Electric Shock: అసలే వర్షాకాలం.. కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటం వల్ల పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యుత్ షాక్ తగిలి పలువురు మృత్యువాత పడుతున్నారు. అనంతపురం జిల్లాలో విద్యుదాఘాతంతో తండ్రీకుమారులు మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంతకల్లు పట్టణ శివారులోని పుల్లన్న అనే వ్యక్తి అతని కుమారునితో కలిసి.. ఇంటి ముందు ఉన్న చెట్టు కొమ్మలను తొలగించటానికి ప్రయత్నించాడు. చెట్టుపై ఉన్న ప్రధాన విద్యుత్ తీగలను గమనించకుండా కొమ్మలను నరకటంతో ప్రమాదం సంభవించింది. దీంతో విద్యుత్‌షాక్ గురై తండ్రీకుమారులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు పుల్లన్నకు మరో కుమారుడు.. ముగ్గరు కుమార్తెలు ఉన్నారు. ఇంటి పెద్దదిక్కు మరణంతో భాదిత కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
విద్యుత్ షాక్‌తో భవన కార్మికుడు మృతి : అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో భవన కార్మికుడిగా పని చేస్తున్న ఓ యువకుడు విద్యుత్‌షాక్‌తో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయదుర్గం మండలం బీఎన్ హళ్లి గ్రామానికి చెందిన సునీల్ అనే యువకుడు.. భవన నిర్మాణ కార్మికుడిగా, వ్యయసాయ కూలీగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాయదుర్గంలో భవన నిర్మాణ పనలు చేస్తున్న సమయంలో ఇనుప చువ్వలు విద్యుత్ తీగలకు తగిలాయి. దీంతో సునీల్ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అది గమనించిన తోటి ప్రయాణికులు అతడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇంటికి చేదోడు వాదోడుగా నిలిచిన సునీల్ మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతునికి తల్లితో పాటు ఓ సోదరి ఉంది.
విద్యుదాఘాతంతో ఇద్దరి మృత్యువాత : వైఎస్సార్ జిల్లాలో జమ్మలమడుగు మండలం పెద్ద దండ్లూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి 10 గంటల సమయంలో శ్రీకాంత్ రెడ్డి (27) ఇంట్లో కరెంటు సరఫరా కాలేదు. ఈ విషయాన్ని శివశంకర్ రెడ్డి(47) అనే వ్యక్తికి చెప్పగా.. పరిశీలిస్తున్న సమయంలో ఇద్దరూ విద్యుత్ షాక్‌కు గురయ్యారు. శివశంకర్ రెడ్డి అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ రెడ్డిని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరేలోగా చనిపోయినట్లు బంధువులు తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో ఆ సమయంలో సుమారు గంట పాటు విద్యుత్ లేకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానికులు చాలా ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే విద్యుత్ సరఫరా లేకపోవడంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పిడుగు పడి ఒకరు మృతి : అల్లూరి జిల్లా అరకులోయ మండలంలో పిడుగు పడటంతో ఒకరు మృతి చెందారు. స్థానికులు తెలిపి వివరాల ప్రకారం..మండలంలోని మాదల పంచాయతీ బుర్రిగూడ గ్రామంలో పశువులను మేపటానికి కొండపైకి వెళ్లాడు. అదే సమయంలో పిడుగు పడటంతో దుబాయ్ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనలో నాలుగు పశువులు సైతం పిడుగు పాటుకు గురై మృత్యువాత పడ్డాయి. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పిడుగుపాటుకు గురై మృతి చెందిన రాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మృతి చెందిన పశువులకు పరిహారం చెల్లించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.