అనంతపురం జిల్లాలో విత్తన పంపిణీ పోలీసుల లాఠీఛార్జీల మధ్య గతంలో ఉద్రిక్తంగా జరిగేవి. బయోమెట్రిక్ విధానం అమలు చేశాక పరిస్థితి కాస్త మెరుగుపడినా... ఎప్పటికప్పుడు సర్వర్ల మొరాయింపుతో రైతులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూసేవారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రాయదుర్గం, ఉరవకొండ మండల కేంద్రాల్లో వేరుశెనగ విత్తన పంపిణీ క్యూలైన్‌లోనే ఇద్దరు రైతులు గుండెపోటుతో మృతి చెందారు. ఈ తరహా అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న జిల్లా వ్యవసాయ శాఖ రైతుల గ్రామాలకే వెళ్లి విత్తన పంపిణీ కూపన్లను ఇచ్చే విధానానికి రాష్ట్రంలోనే తొలిసారిగా శ్రీకారం చుట్టింది. ఈ పద్ధతి తమకు చాలా అనుకూలంగా ఉందని... మండల కేంద్రానికి వ్యయప్రయాసకోర్చి వెళ్లాల్సిన అవసరం ఇకపై ఉండదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాల్లోనే రైతుల వేలిముద్రలను బయోమెట్రిక్ ద్వారా తీసుకుని కూపన్లు ఇస్తుండటంపై రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. మండల కేంద్రంలో అయితే విత్తనాలు తప్పుదోవ పట్టే అవకాశాలు ఉండేవని... ఇప్పుడు దాని అరికట్టినట్టైందని అభిప్రాయపడుతున్నారు.
రబీ ప్రారంభంలోనే వర్షాలు సమృద్ధిగా కురవటంతో అన్నదాతలు హర్షిస్తున్నారు. వేరుశెనగ విత్తన రాయితీని 40 నుంచి 50శాతానికి పెంచటమే కాక ఒక్కో రైతుకు 125 కిలోల విత్తనాలను 5 బస్తాల్లో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లావ్యాప్తంగా 75వేల క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేయాలని అనంతపురం జిల్లా వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది.