అనంతపురం జిల్లాలో ఇసుక వనరులు తగినంత ఉన్నా నిర్మాణదారులకు అందని దుస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా ఉన్న ఓపెన్ రీచ్‌లలో కన్నేపల్లి, అజయ్యదొడ్డి, జుంజురాంపల్లిలో మాత్రమే తవ్వకాలు జరుగుతున్నాయి. అనివార్య కారణాల వల్ల రచ్చుమర్రి రేవులో సరఫరా ఆగిపోయింది. హిందూపురం, బేవనహళ్లి, చెన్నంపల్లి, తిమ్మసముద్రంలలో ఇటీవలే టెండర్లు ప్రక్రియ పూర్తి చేశారు. డిసిల్టేషన్ రేవులు ముదిగుబ్బ మండలం ఉప్పలపాడు, పీసీ రేవు, కొడవాండ్లపల్లి, తాడిమర్రి మండలం సీసీ రేవు, పుట్టపర్తిలో ఉన్నాయి. వీటిలో ఉప్పలపాడు రేవులో ఇసుక నిల్వలు ఖాళీ అవడంతో ఆగిపోయింది. పట్టాదారు భూముల్లో 16 రీచ్‌లు ఉండగా వాటిలో ఆరు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. మరో ఐదింటికి గుత్తేదారుల ఎంపిక పూర్తెంది. తవ్వకాలు ప్రారంభం కావాల్సి ఉంది. మిగతా ఐదు రీచ్‌లు వివిధ కారణాల వల్ల అందుబాటులోకి రాలేదు. 123 వాగులు, వంకలు గుర్తించగా అందులో 62 మాత్రమే ఇసుక కార్యకలాపాలు జరుగుతున్నాయి.
పనిచేయని ఫిర్యాదు కేంద్రాలు
వినియోగదారుల ఇబ్బందులను పరిష్కరించడానికి ప్రభుత్వం 14500 అనే టోల్‌ఫ్రీ నెంబరును కేటాయించింది. అలాగే జిల్లాస్థాయి ఏపీఎండీసీ మేనేజర్, పర్యవేక్షకుల మొబైల్ నంబర్లను అందుబాటులో ఉంచింది. అయితే వీటిలో ఏ ఒక్క ఫోన్ నెంబరు పనిచేయడం లేదు. టోల్‌ఫ్రీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా వాటిని పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారు.
మొరాయిస్తున్న ఆన్‌లైన్..
వినియోగదారులు సొంత చరవాణి, సచివాలయాలు, మీ-సేవ కేంద్రాల్లో ఏపీఎండీసీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ ద్వారా తమకు కావాల్సి ఇసుకను నమోదు చేసుకునే అవకాశముంది. అయితే ఆన్‌లైన్ బుకింగ్ వినియోగదారులకు తలనొప్పిగా మారింది. లబ్ధిదారుని వివరాలు నమోదు చేసి నగదు బదిలీ సమయంలో ‘ఫెయిల్’ అని చూపెడుతోంది. 12 రోజులుగా సమస్య ఉత్పన్నమవుతోంది. నిర్మాణదారులు రోజూ ఆన్‌లైన్‌లో బుకింగ్ కోసం ప్రయత్నించి విఫలమవుతున్నారు. మరికొన్ని చోట్ల ఇసుక రిజిష్టరైనా వినియోగదారుని ఇంటికి చేరడం లేదు. ఆన్‌లైన్‌లో నిల్వకేంద్రాల ఏర్పాటులో సైతం తప్పులు దొర్లాయి. ఉదాహరణకు ఉరవకొండలో కేంద్రం లేదు. అక్కడ కేవలం వానాకాలంలో అవసరమయ్యే ఇసుకను నిల్వ చేసి ఉంచారు. అయితే వెబ్‌సైట్‌లో మాత్రం ఉరవకొండలో నిల్వకేంద్రం ఉన్నట్లు చూపిస్తోంది. దీంతో వినియోగదారులు ఉరవకొండ నిల్వకేంద్రం నుంచి నమోదు చేసుకుంటున్నారు. అక్కడ యార్డు లేదని తెలుసుకుని లబోదిబోమంటున్నారు. ఆన్‌లైన్‌లో చెల్లించిన సొమ్ములను తిరిగి పొందడానికి ఆపసోపాలు పడుతున్నారు.
12 రోజులుగా తిరుగుతున్నా..
ఇసుక ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకొందామని 12 రోజులుగా సచివాలయం చుట్టూ తిరుగుతున్నా నమోదు కావడం లేదు. పుట్టపర్తి, హిందూపురం, అమ్మడగూరు ప్రాంతాల సచివాలయాల ద్వారా ప్రయత్నం చేసినా ఫలితం లేదు. - అశ్వర్థరెడ్డి, మరవకొత్తపల్లి, చిలమత్తూరు మండలం
వారంలోపు సమస్యను సరిదిద్దుతాం
ఆన్‌లైన్‌లో ఇసుక నమోదుకు తలెత్తుతున్న సమస్యలు మా దృష్టికి వచ్చాయి. మీ-సేవ, సచివాలయాల్లో సర్వర్లు మొరాయిస్తున్నట్లు తెలిసింది. సాంకేతిక లోపాలను ఉన్నతాధికారులకు తెలిపాం. వారంలోగా ఆన్‌లైన్‌లో తలెత్తుతున్న లోపాలను సరిదిద్దుతాం. నిల్వకేంద్రాల ఎంపికలో పొరపాటుపడి డబ్బులు చెల్లించిన వారికి న్యాయం చేస్తాం. - వెంకటేశ్వర్లు, డీఎస్‌వో, అనంతపురం
ఇదీ చదవండి: ఉదయం 11 గంటలకు ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ప్రారంభం