మామూలుగా చిన్నారులెవరైనా చదువుతో పాటు ఏదో ఒకదానిలో నైపుణ్యం కలిగి ఉండటం సర్వసాధారణం. కాని అనేక అంశాల్లో బహు ప్రావీణ్యం సొంతం చేసుకోవటమంటే అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుంటూ దూసుకపోతున్న రామలాలిత్య శభాష్ అనిపించుకుంటోంది.
అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన రామలాలిత్య మూడేళ్ల వయసులోనే ఈటీవీ నిర్వహించిన ఆంధ్రావాలా పోటీల్లో గెలిచి అవార్డు సొంతం చేసుకుంది. చిన్నతనం నుంచే నృత్యం, నటన అంటే అత్యంత మక్కువ చూపే లాలిత్యకు తలిదండ్రుల ప్రోత్సాహం తోడవడం వల్ల వజ్రానికి సానపట్టిన తీరైంది. ప్రస్తుతం రామలాలిత్య అనంతపురం పీవీకేకే కళాశాలలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. ఓవైపు చదువు, మరోవైపు కూచిపూడి నాట్య ప్రదర్శనలతో రామలాలిత్య జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు.
బాబు బాలజీ, కమల బాలజీ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి హర్షశ్రీ నాట్యంలో విశేషంగా రాణిస్తూ... గిన్నీస్ బుక్ ఆఫ్ అవార్డును సొంతం చేసుకున్నారు. హర్షశ్రీ వివాహం అనంతరం హైదరాబాద్లో ఉంటూ కూచిపూడి నాట్య శిక్షణ కేంద్రం నెలకొల్పి అనేకమందికి శిక్షణ ఇస్తున్నారు. బాలాజీ, కమల దంపతులకు రామలాలిత్య రెండో సంతానం కాగా, మూడేళ్ల వయసు నుంచే నాట్య శిక్షణ తీసుకుంటూ దేశవ్యాప్తంగా వంద వరకు ప్రదర్శనలు ఇచ్చారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నిర్వహించిన కూచిపూడి నాట్య పోటీల్లో పాల్గొని 22 వరకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సాధించారు. రామలాలిత్య తలిదండ్రులు నాట్య కళాకారులు కావటం వల్ల ధర్మవరంలో మూడు దశాబ్దాలకుపైగా నాట్య కళానికేతన్ నడుపుతున్నారు. శ్రీ లలిత కళా నాట్యకళానికేతన్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ నాట్యాలయం ద్వారా వందలాది మంది చిన్నారులను అవార్డులు సాధించేలా తీర్చిదిద్దారు. తాము ఎంతో సాధించాలనుకొని, సాధ్యం కాక, ఆ కల తమ పిల్లల ద్వారా సాకారం చేసుకుంటున్నట్లు రామలాలిత్య తలిదండ్రులు చెబుతున్నారు..
ఉత్తర భారతదేశంలోనూ ఉత్తమంగా...
రామలాలిత్య ఉత్తర భారతదేశంలో అంతర్జాతీయ సంస్థలు నిర్వహించిన అనేక నాట్య పోటీల్లో పాల్గొని ఉత్తమ నాట్య కళాకారిణిగా అవార్డులు పొందారు. వారణాసి,మౌంట్ అబు, దిల్లీ, షిర్డీ, మధురై ఇలా అనేక ప్రధాన నగరాల్లో రామలాలిత్య ప్రదర్శనలు ఇచ్చారు. గిన్నీస్ బుక్ ఆఫ్ అవార్డు, భారత్ బుక్ ఆఫ్ అవార్డు, గెలాక్సీ బుక్ ఆఫ్ అవార్డు, తెలుగు బుక్ ఆఫ్ అవార్డు, కల్చరల్ బుక్ ఆఫ్ అవర్డు ఇలాంటిని తొమ్మిది సొంతం చేసుకుంది. ఈ యువతి ఒక్క నాట్యంలోనే కాకుండా నటనపైనా మక్కువ పెంచుకుని సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్టు చేసింది. రామలాలిత్య అనుకరణ వీడియోలకు 50 వేల మందికిపైగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులున్నారు. పాత సినిమాలు ఎక్కువగా చూసే అలవాటున్న ఆ యువతి, సావిత్రి, బి.సరోజ, జమున తదితర కథానాయికల నటనను అనుకరిస్తూ అందరినీ అబ్బురపరుస్తోంది. తల్లిదండ్రులే గురువులు కావటం, అవార్డులు సాధించేంతటి గౌరవం దక్కటం తన అదృష్టమని, వారి కల, లక్ష్యం నెరవేర్చటమే తన కర్తవ్యమని నాట్యకారిణి రామలాలిత్య చెబుతున్నారు.
ఇదీ చదవండి. 10 ఉపగ్రహాలతో నేడు నింగిలోకి పీఎస్ఎల్వీసీ 49