తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తడంతో అధికారులు దిగువనున్న కాలువలకు నీటిని విడుదల చేశారు. అందులో భాగంగా అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం ఆంధ్ర సరిహద్దులోని హెచ్ఎల్సీ 105వ కిలోమీటర్ వద్ద స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తుంగభద్ర జలాలకు ఘన స్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏడాది రైతులకు పంటలు బాగా పండాలని, మంచి ధరలు రావాలని గంగా మాతను ప్రార్థించారు. కరువు కాటకాలతో సతమతమవుతున్న రైతులకు హెచ్ఎల్సీ నీరు రావడంతో ఎంతో ఊరట కలిగించిందన్నారు. తుంగభద్ర జలాశయం వరద నీటితో నిండడంతో హెచ్ఎల్ సికి అధికారులు నీటిని విడుదల చేయడం జరిగిందనీ..ఈ నీటిని అనంతపురం, కడప జిల్లాలలోని తాగు సాగునీటి అవసరాలకు వినియోగించనున్నట్లు తెలిపారు. బొమ్మనహల్ కనేకల్ మండలంలోని హెచ్ఎల్సీ ఆయకట్టు భూములకు నేటి నుంచి సాగునీరు విడుదల చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ ఏర్పాటు చేసిందని, హెచ్ఎల్సీ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:వాళ్లు కత్తులు దూస్తే.. పతకాల పంట పండినట్టే