ఆధార్ కార్డు సవరణల కోసం ప్రజలు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని స్టేట్ బ్యాంకు వద్ద సోమవారం ప్రజలు పెద్ద ఎత్తున ఆధార్ కార్డు మార్పులు, చేర్పులు కోసం తరలి వచ్చారు. చంటి బిడ్డలతో వచ్చిన తల్లులు, వికలాంగులు, వయో వృద్ధులు ఆధార్ కార్డుల్లో మార్పుల కోసం క్యూ కట్టారు. ఆధార్ కార్డు సవరణల కోసం పట్టణంలోని స్టేట్ బ్యాంకులో మాత్రమే కేంద్రం ఏర్పాటు చేయడంతో ప్రజల సమస్య వర్ణనాతీతంగా మారింది.
రోజుకు 30 మందికి మాత్రమే బ్యాంకు అధికారులు సవరణల కోసం టోకెన్లు ఇస్తుండటంతో....తెల్లవారు జాము నుంచే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిమిత సంఖ్యలోనే అర్జీలు స్వీకరించడం ద్వారా పూర్తిస్థాయిలో ఆధార్ సేవలు అందడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. ఆధార్ కార్డులో మార్పుల కోసం 15 రోజులపాటు స్టేట్ బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు అధికారులు మాత్రం ఆధార్ కార్డుల సవరణ పని భారం ప్రభుత్వం అదనంగా తమపై మోపిందని ప్రత్యక్షంగా ఆవేదన వ్యక్తం చేస్తూ మండిపడుతున్నారు.
ఇదీ చదవండి: