అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని గాంధీ చౌక్ వీధిలో షేక్ అమీనా బీ అనే వృద్ధురాలు నివసిస్తోంది. గత 50 సంవత్సరాల నుంచి ఆమె అదే ప్రాంతంలో ఉంటోంది. ఆమె భర్త 30 ఏళ్ల క్రితం మరణించాడు. ఆ తర్వాత ఆమె వితంతు పింఛన్‌కు దరఖాస్తు చేసుకుంది. గత 20 ఏళ్లుగా ఆమెకు వితంతు పింఛన్ వస్తోంది. 200 రూపాయల పింఛన్ నుంచి తెదేపా హయాంలో పెంచిన రూ.2 వేలు.. ఆపై వైకాపా ప్రభుత్వంలో 2,250 రూపాయల పింఛన్ తీసుకుంటూ జీవనం సాగిస్తోంది.
గత రెండు నెలలుగా షేక్ అమీనా బీకి ఉన్నట్టుండి పింఛన్ రావడం ఆగిపోయింది. జులై నుంచి పింఛను నిలిపేయటంతో కంగారు పడిన ఆమె.. కారణాలు తెలుసుకునేందుకు అధికారుల చుట్టూ తిరిగారు. ఊళ్లో చాలా మందికి వస్తుండగా.. తనకెందుకు రావట్లేదో చెప్పాలని అధికారులను బతిమాలింది. తన జీవనాధారంగా ఉన్న పింఛన్‌ను ఎందుకు ఆపేశారో చెప్పాలని అక్కడ సిబ్బందిని ప్రశ్నించింది. తొలగింపునకు అధికారులు చెప్పిన సమాధానం విని బామ్మ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. ఎందుకంటే ఆమె వయసు ఆధార్ కార్డులో 16 ఏళ్లని ఉంది. కేవలం ఆధార్ కార్డులోనే కాకుండా, రేషన్ కార్డులో కూడా అంతే వయసు ఉందని.. ఆందుకే పింఛన్ తొలగించాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు.
ఆధార్ కార్డులో వయసు మార్పిడి కోసం షేక్ అమీనా బీ స్థానిక ఆధార్ కేంద్రానికి వెళ్లింది. యూఐడీఏఐ పోర్టల్‌లో కేవలం మూడు సంవత్సరాల వరకే మార్పులు చేసేందుకు అవకాశం ఉండడంతో ఇక్కడ చేయలేకపోయామని ఆధార్ కేంద్రం నిర్వాహకుడు తెలిపారు. వృద్ధురాలికి సత్వర న్యాయం జరిగేలా ప్రయత్నిస్తానని ఉరవకొండ తహసీల్దార్ మునివేలు అన్నారు.
ఇదీ చూడండి: VIJAYA SAI REDDY: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి.. అలాగే ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌లకు కూడా..!