కూరగాయలు సాగు చేసే రైతులకు.. బెంగళూరుకు చెందిన ఐఐహెచ్ఆర్ సంస్థ.. బ్రహ్మాస్త్రాన్ని అందించింది. విత్తనాల సమస్యతో సతమతం అవుతున్న వారి సమస్యలు పరిష్కరిస్తూ.. వీర లెవెల్లో బీరకాయ విత్తనాన్ని అందించింది. ఆర్కా ప్రసన్ పేరుతో.. ఈ కొత్త రకాన్ని అందుబాటులోకి తెచ్చింది. వేలకు వేలు వసూలు చేయకుండా.. కిలో వంగడాలను కేవలం 1200 రూపాయలకే అందిస్తోంది. ఇది ఒక్కరు కొంటే చాలు. ఓ రైతు.. మరో రైతు నుంచి తీసుకుని.. ఎంతమందైనా.. ఎన్నిసార్లైనా పంట వేసుకోవచ్చు.
10 టన్నులు అనుకున్నారు.. 15 టన్నులు వచ్చింది
కూరగాయల విత్తనాల పరిశోధనలో రైతులకు అండగా నిలుస్తున్న భారతీయ ఉద్యాన పంటల పరిశోధన సంస్థ... అనేక రకాల విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే.. బీరకాయ వంగడాన్ని అభివృద్ధి చేసింది. వీటితో ఎకరాకు పది టన్నుల దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేయగా.. అనంతపురానికి చెందిన రైతు... 15 టన్నుల దిగుబడి సాధించారు.
త్వరలోనే టమోటా, బెండకాయ విత్తనాలు
అనంతపురం రైతులు... అత్యధికంగా కూరగాయలు సాగుచేస్తుంటారు. సమీపంలోని బెంగుళూరు మార్కెట్ లో మంచి ధర పొందుతారు. ఇది గుర్తించిన ఐఐహెచ్ ఆర్ సంస్థ.. ఇక్కడి రైతులకు అండగా నిలిచింది. చౌకగా విత్తనాలు ఇచ్చి, సాగు చేయించేలా ప్రణాళిక చేసింది. రైతులతో క్షేత్రస్థాయి పర్యటన ఏర్పాటుచేసింది. నుతన వంగడాన్ని అందించి అనూహ్య ఫలితాన్ని సాధించింది. వేలకు వేల రూపాయల మేర.. విత్తనాలకు అయ్యే ఖర్చును దూరం చేసింది. ఈ ఉత్సాహంతో.. త్వరలోనే టమోటా, బెండకాయ విత్తనాలనూ అందించేలా కృషి చేస్తోంది.