పోలీసులు లాఠీలు తీసుకొచ్చినా.. లారీలు తీసుకొచ్చినా ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం ఆగదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్ (శ్రీసాయిబాబా నేషనల్) కళాశాలలో ఈనెల 8న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేయడాన్ని ఖండిస్తూ.. లోకేశ్ బుధవారం జిల్లాలో పర్యటించారు. విద్యార్థులతో ముఖాముఖిలో మాట్లాడారు. మాజీ సీఎంలు ఎన్టీఆర్, వైఎస్సార్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ స్పీకర్ బాలయోగి తదితరులు ఎయిడెడ్ పాఠశాలల్లోనే చదివి పైకొచ్చారని గుర్తుచేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీఛార్జీ చేయించడంపై ప్రభుత్వం క్షమాపణ చెప్పకపోగా, ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. విద్యార్థి సంఘాల నేతలే దుశ్చర్యకు పాల్పడ్డారని మంత్రులు చెప్పడాన్ని ఖండించారు. జగన్‌రెడ్డి ఎయిడెడ్ విద్యాసంస్థలను వెంటపడి తరుముతున్నారని, ఆయన రక్తంలో అభివృద్ధి లేదు, అంతా వినాశనమేనని లోకేశ్ ఆరోపించారు.
కార్యక్రమానికి హాజరైన ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల విద్యార్థులు
మేనమామగా ఉంటానన్న హామీ ఏమైంది?
‘జీవో 42తో ఎయిడెడ్ విద్యాసంస్థలను నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు. రత్నకుమారి కమిటీ ఎవరితోనూ మాట్లాడకుండానే ఆరు రోజుల్లో నివేదిక ఇచ్చింది. విలీనం ఇష్టంలేని విద్యాసంస్థలను ఎయిడెడ్‌గానే కొనసాగిస్తామని చెబుతున్నారు. ఇదే విషయాన్ని జీవోలో ఎందుకు ప్రస్తావించలేదు? ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని అడిగినందుకు విద్యార్థులను దొంగల మాదిరి పోలీసు వాహనాల్లో తీసుకెళ్తారా? పిల్లలకు మేనమామగా ఉంటానన్న జగన్‌రెడ్డి హామీ ఏమైంది? తమ కాలేజీని యథాతథంగా కొనసాగించాలని అడిగిన ఎస్‌ఎస్‌బీఎన్ విద్యార్థులపై లాఠీఛార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకొని, సీఎం క్షమాపణ చెప్పాలి. విశాఖ, కాకినాడ, గుంటూరు, నెల్లూరులోనూ విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనలపై స్పందించాలి’ అని లోకేశ్ డిమాండ్ చేశారు. ‘ఎయిడెడ్ సంస్థలన్నీ ప్రైవేటుగా మారితే ఫీజులు పెరిగి తల్లిదండ్రులపై భారం పడుతుంది. గతంలో ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలలో రూ.5 వేలు ఉన్న ఫీజు ఇప్పుడు రూ.20 వేలు అయింది. రాష్ట్రవ్యాప్తంగా 2,203 ఎయిడెడ్ పాఠశాలల పరిధిలో 1,96,313 మంది, 182 జూనియర్ కళాశాలల్లో 71,035 మంది విద్యార్థులతోపాటు 116 డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న వారి భవిష్యత్తు అంధకారంగా మారుతుంద’ని లోకేశ్ వాపోయారు.
కళాశాలలో పోలీసులకు పనేంటి?
విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే కళాశాలలోకి పోలీసులు ఎందుకు వెళ్లారు, వారిని యాజమాన్యం ఎలా అనుమతించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ‘పోలీసులకు, డీఎస్పీ రాఘవరెడ్డికి కళాశాలలో పనేంటి? పిల్లలను దొంగల మాదిరిగా కొడతారా? ఆడపిల్లలనూ వదిలిపెట్టలేదు. దీన్ని సీఎం ఖండించాలి. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాల’ని డిమాండ్ చేశారు.
ఆసక్తికర ఘట్టం
లోకేశ్ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం కన్పించింది. లోకేశ్‌కు స్వాగతం పలకడానికి నాయకులంతా అనంతపురం జిల్లా సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడ పరిటాల శ్రీరామ్‌ను జేసీ ప్రభాకర్‌రెడ్డి దగ్గరకు తీసుకుని కౌగిలించుకున్నారు. కార్యకర్తలతో సరదాగా మాట్లాడుతూ ఒకరినొకరు చేయి పట్టుకుని ముందుకుసాగారు.
ఇదీ చదవండి: