అనంతపురం జిల్లాలో కార్మికుల నిరసన..
తమ సమస్యలు పరిష్కరించాలని అనంతపురం జిల్లా హిందూపురంలో పారిశుద్ధ్య కార్మికులు వినూత్నరీతిలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచాలని కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.
రాయదుర్గంలో మున్సిపల్ కార్మికుల సమ్మె రెండో రోజు ఉద్ధృతంగా కొనసాగింది. మున్సిపల్ కార్యాలయం ముందు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పట్ల స్పందించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
కళ్యాణదుర్గంలో పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ... మున్సిపల్ కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రకాశం జిల్లాలో...
ప్రకాశం జిల్లా అద్దంకిలో తమ సమస్యలను పరిష్కరించాలని కాంట్రాక్ట్ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. ప్రభుత్వం గత మూడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వేతనాలు చెల్లించాలని సీఐటీయూ నాయకుడు సి.హెచ్ గంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఒంగోలులో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యాక్రమం చేపట్టారు. నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
గుంటూరు జిల్లాలో...
గుంటూరు జిల్లా తెనాలిలో మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. తమను ఆప్కాస్‌లో విలీనం చేయవద్దని పర్మినెంట్ చేసిన అనంతరం ఏ సంస్థలో విలీనం చేసిన తమకు అభ్యంతరం లేదని వారు తెలిపారు.
విజయనగరం జిల్లాలో...
విజయనగరం జిల్లా పార్వతీపురంలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. నాలుగు రోడ్ల కూడలి నుంచి ఉప కలెక్టర్ కార్యాలయం వరకు కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కార్మికుడు ఎవరైనా చనిపోతే ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగావకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
నెల్లూరు జిల్లాలో...
మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా నెల్లూరులో రెండోరోజు కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గాంధీబొమ్మ సెంటర్ వద్ద ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంట్రాక్ట్ పారిశుద్ధ్య సిబ్బందిని రెగ్యులర్ చేయాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
గూడూరులో మున్సిపల్ కార్మికులు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో మున్సిపల్ కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారని వారు తెలిపారు. అయినప్పటికీ వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ పర్మినెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
విశాఖ జిల్లాలో...
విశాఖ జిల్లా అనకాపల్లిలో తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు రెండో రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐటీయూ నాయకులు మళ్ల సత్యనారాయణ, బాలకృష్ణ మాట్లాడుతూ..సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లాలో...
తమ సమస్యలను పరిష్కరించాలని కర్నూలు జిల్లా నంద్యాల ఆర్డీవో కార్యాలయ ఎదుట పురపాలక సంఘం కార్మికులు రెండో రోజు ధర్నా చేశారు. తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: