అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని కుమ్మరి వీధిలో నివాసముంటున్న తిమ్మరాజు (65) అనే వ్యక్తి.. ఓ పోలీస్ కానిస్టేబుల్ బెదిరించడంతో అస్వస్థతకు గురై మృతి చెందాడు. మృతుని కుమారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయదుర్గం పట్టణానికి చెందిన జంగమ వీరేష్ అనే యువకుడు తెలంగాణ హైదరాబాద్‌లోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. రాయదుర్గం పట్టణంలోని కుమ్మరి వీధిలో ఉన్న కుమ్మరి అంజినప్ప వద్ద గతంలో ఇంటిని కొనుగోలు చేశాడు. కుమ్మరి అంజినప్ప తమ్ముడైన తిమ్మరాజును గత రెండేళ్లుగా తాను కొనుగోలు చేసిన ఇంటి ముందు 20 అడుగుల స్థలాన్ని వదలాలని మానసిక వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. రాయదుర్గం పోలీసుల సహకారంతో ఇటీవల బెదిరించడంతో పాటు స్టేషన్‌కు తీసుకు వెళ్లి కొట్టించాడు. మంగళవారం మధ్యాహ్నం తిమ్మరాజు తన ఇంటి ముందు ద్విచక్ర వాహనాన్ని నిలిపి ఉంచగా.. అదే సమయంలో కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ప్రైవేట్ నీటి ట్యాంకర్‌ను తెప్పించుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని రోడ్డుకు అడ్డంగా పెట్టావంటూ తిమ్మరాజుతో గొడవ పడ్డారు. అక్కడితో ఆగకుండా హైదరాబాద్‌లో పోలీస్ కానిస్టేబుల్ వీరేష్ తిమ్మరాజుకు ఫోన్ చేసి తీవ్రస్థాయిలో బెదిరించాడు. అక్రమ కేసులు బనాయించడంతో పాటు కరెంట్ షాక్ ఇప్పించి, పోలీసులతో కాళ్లు చేతులు విరగ గొట్టిస్తానని తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. దీంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురై అస్వస్థతకు గురయ్యాడు. ఇంటి వద్దే సొమ్మసిల్లి పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక కమ్యూనిటీ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు తెలిపారు.
" స్థలం వివాదం మనసులో పెట్టుకుని గొడవ పడ్డారు. అక్కడితో ఆగకుండా హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు కానిస్టేబుల్ వీరేశ్.. రాయదుర్గం పోలీసులతో బెదిరించాడు. స్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టారు. దీంతో తీవ్ర అనారోగ్యానికి గురైన తిమ్మరాజు మృతి చెందారు. "
- అంజినప్ప, మంజు, ఉమేశ్ . మృతుడి సోదరుడు, కుమారులు.
ఇదీ చదవండి: కుమారుడి పెళ్లి కోసం.. సొంత సొమ్ముతో రహదారికి మరమ్మతులు