అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం వెంగళమ్మ చెరువు గ్రామంలో గీతాంజలి అనే వివాహిత అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. జిల్లాలోని ముదిగుబ్బకు చెందిన కుళ్లాయప్ప, అలివేలమ్మల ఏకైక కుమార్తె గీతాంజలి. బీటెక్ వరకు చదివిన ఆమెకు.. అదే గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ సురేశ్‌తో 6 నెలల క్రితం వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో రూ. 1.50 లక్షల కట్నం, 16 తులాల బంగారం ఇచ్చారు. ప్రస్తుతం సురేశ్ భద్రాచలంలో విధులు నిర్వహిస్తున్నాడు. 2 నెలల వరకు వారి కాపురం అన్యోన్యంగా సాగింది. అయితే తర్వాత నుంచి కలతలు వచ్చాయి.
అదనపు కట్నం కోసం అత్తమామలు, ఆమె భర్త తమ కుమార్తెను వేధించినట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ఈ క్రమంలోనే విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన సురేశ్, గీతాంజలిని తీసుకుని తన చిన్నాన్న ఊరు వెంగళమ్మచెరువుకు వెళ్లాడు. అక్కడ ఏమైందో తెలియదు కానీ.. గీతాంజలి ఉరి వేసుకున్న స్థితిలో చనిపోయి ఉంది. ఆమె భర్తే తమ కుమార్తెను హింసించి, హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. వారు అడిగిన అదనపు కట్నం ఇస్తామని చెప్పామని.. అయినా కూడా తమ బిడ్డను అన్యాయంగా చంపేశారని అన్నారు. ఈ ఘటనపై పుట్టపర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి.. కామధేనువు అనుకుంటే.. కళేబరమయ్యావా తల్లీ!