ఉపాధి లేకపోవటం, అప్పుల బాధతో మనస్తాపానికి గురైన ఓ కూలి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఇంద్రావతి గ్రామానికి చెందిన వన్నూరు స్వామి (35)... ముంబయిలో కొన్ని సంవత్సరాలుగా కూలి పని చేస్తుండేవాడు. లాక్డౌన్ కారణంగా అక్కడి నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చిన అతను... ఇంటి వద్దే ఉంటూ చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
కరోనా సమయం నుంచి ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఎక్కువ కావటంతో అతను మనస్తాపానికి గురై ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడని బాధిత కుటుంబసభ్యులు వెల్లడించారు. హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని భార్య బోరున విలపించడం అక్కడున్న వారిని కలచివేసింది. నలుగురు పిల్లలను ఎలా పోషించాలంటూ కన్నీరుమున్నీరైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.