Literary optimist Prakash Rao died : అనంతపురం జిల్లా పెనుకొండకు చెందిన అష్టావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆశావాది ప్రకాశరావు (77) గురువారం సాయంత్రం గుండెపోటుతో స్వగృహంలో కన్నుమూశారు. శింగనమల మండలం కొరివిపల్లి గ్రామానికి చెందిన ప్రకాశరావు 1944 ఆగస్టు 2న జన్మించారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో ప్రకాశరావు డిగ్రీ చదివే రోజుల్లో ఈ విద్యాలయం అధ్యాపకుడిగా ఉన్న రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నుంచి ‘బాలకవి’ ఆశీర్వాదం అందుకున్నారు. అప్పుడే మొదటి అష్టావధానం చేసి ఈ సాహితీ ప్రక్రియలో తనదైన ముద్ర వేశారు.
తెలుగునేలతో పాటు తమిళనాడు, కర్ణాటక, దిల్లీ తదితర ప్రాంతాల్లో 171 అష్టావధానాలు చేశారు. రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. పలు కళాశాలల్లో తెలుగు అధ్యాపకుడిగా, ప్రిన్సిపల్‌గా సేవలందించారు. 1978-83 మధ్య ఆంధ్రపదేశ్ సాహిత్య అకాడమీ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యుడిగా, తిరుమల తిరుపతి దేవస్థానం గ్రంథనిపుణుల మండలి సభ్యుడిగా పనిచేశారు. పుష్పాంజలి, వరదరాజ శతకం, విద్యాభూషణ, మెరుపు తీగలు, ఆర్కెస్ట్రా, అంతరంగ తరంగాలు తదితర పుస్తకాలను రచించారు. 40కిపైగా పురస్కారాలు, అవార్డులు అందుకున్నారు. 2020-21కుగాను భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని గతేడాది నవంబరులో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. ఆయన భార్య లక్ష్మి గతంలోనే మరణించారు. నలుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆయన కోరిక మేరకు కుటుంబసభ్యుల అంగీకారంతో ఆయన కళ్లను హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్య సిబ్బంది సేకరించారు.