అనంతపురం నుంచి త్వరలోనే కిసాన్ రైలు ప్రారంభం కానుంది. ఇందుకు రైల్వే శాఖ అంగీకరించడం.. జిల్లా ఉద్యాన రైతులను ఆనందానికి గురి చేస్తోంది. తమ ఉత్పత్తులకు మరింత మార్కెట్ రానుందన్న సంతోషం.. వారిలో వ్యక్తం అవుతోంది.
దేశంలో తొలి కిసాన్ రైలు నాసిక్ నుంచి బీహార్‌కు నడుస్తోంది. ఈ రైలులో ఉద్యాన పంటలు, కూరగాయలు, పూలు రవాణా చేస్తున్నారు. అనంతపురం నుంచి రెండో కిసాన్ రైలు నడవనుంది. ఇది అనంత రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. తొలిసారిగా ఉత్పత్తులతోపాటు ఉద్యానాధికారులు, రైతులు వెళుతున్నారు. మార్కెట్‌లో రైతులకు అవగాహన కల్పించేందుకు అధికారులు ఉంటారు. వీరికోసం కిసాన్ రైలులోనే స్లీపర్ కోచ్ ఒకటి, రెండు బోగీలు ఏర్పాటు చేసేందుకు రైల్వే అధికారులు అంగీకరించారు. ప్రస్తుతం వారానికొకసారి రైలు నడపాలని నిర్ణయించారు.
సంచులకు నింపిన చీనీకాయలు
తొలుత 30 వ్యాగన్లలో 500 మెట్రిక్ టన్నులు తీసుకెళ్లాలని నిర్ణయించినా ఉత్పత్తులు దొరకడం కష్టంగా ఉండటంతో 18 మెట్రిక్ టన్నుల చొప్పున 20 వ్యాగన్లలో 350 మెట్రిక్ టన్నులు తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఒక్కసారి రైలులో సుమారు రూ.2 కోట్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేయవచ్చు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి, నష్టపోకుండా బీమా ప్రీమియం రైతులతో కట్టించనున్నారు. కొంత సొమ్ము చలానా రూపంలో ముందుగా చెల్లించాలని రైల్వే అధికారులు చెప్పడంతో ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
అనంత స్టేషన్ నుంచే శ్రీకారం
ఈనెల 9న కిసాన్ రైలులో ఉద్యాన ఉత్పత్తులు ఎగుమతి చేయడానికి అంతా సిద్ధం చేస్తున్నారు. అనంతపురం రైల్వేస్టేషన్ నుంచే ప్రారంభిస్తున్నారు. జిల్లాలో ఎంపిక చేసిన రైతులు, వ్యాపారుల నుంచి ఉత్పత్తులను సేకరించే పనులు జోరుగా సాగుతున్నాయి. ఆయా ప్రాంతాల నుంచి ఉత్పత్తులను అనంత రైల్వే స్టేషన్‌కు తీసుకురావాలని అధికారులు సూచించారు. ఇది విజయవంతం ఐతే గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం రైల్వేస్టేషన్ల నుంచి కిసాన్ రైలు నడిపేందుకు కలెక్టర్ గంధం చంద్రుడు ప్రతిపాదనలు రైల్వే శాఖకు పంపారు.
36 గంటల్లో మార్కెట్‌కు..
జిల్లాలో పండించే ఉద్యాన పంటలను కొందరు రైతులు ఇప్పటికే రోడ్డు మార్గాన దిల్లీ మార్కెట్‌కు తరలిస్తున్నారు. అనంతపురం నుంచి దిల్లీ 2,190 కిలోమీటర్లు. లారీల్లో రవాణాకు 4-5 రోజులు పడుతోంది. అదే కిసాన్ రైలులో 36 గంటల్లోనే మార్కెట్‌కు ఉత్పత్తులు చేరుతాయి. టన్ను రవాణాకు రూ.5,136 చెల్లించాలని నిర్ణయించారు. రైతు రైలు ప్రారంభంతో రైతులతో పాటు సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది.
ఇవీ చదవండి: