Jagananna Bhu hakku and Bhu Raksha latest news: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు 'జగనన్న భూ హక్కు, భూ రక్ష' పేరిట పాసు పుస్తకాలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం పంపిణీ చేసిన ఆ పాసు పుస్తకాల్లో అచ్చుతప్పులు ఉన్నాయంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. గ్రామాల్లో భూ తగాదాల పరిష్కారం దిశగా సాగాల్సిన రీ-సర్వే కొత్త సమస్యలను తెచ్చిపెట్టిదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా గ్రామాల్లో వాస్తవ విస్తీర్ణం కంటే 5 నుంచి 10 వేల ఎకరాలు అదనంగా రికార్డుల్లో కనిపించడం.. వాటికి రైతుల వద్ద తగిన ఆధారాలు ఉండడం తీవ్ర సమస్యగా మారింది. అంతేకాదు, జగనన్న భూ హక్కు, భూ రక్ష పేరిట పంపిణీ చేసిన పాసు పుస్తకాల్లో అచ్చుతప్పులపాటు విస్తీర్ణంలో తేడాలు ఉండడంతో వివాదాలు రోజురోజుకు ముదురుతుండటం రైతుల్లో తీవ్ర కలవరాన్ని రేపుతోంది.
భూముల కొలతలు వేసి హద్దులు గుర్తించడం అనేది సవాల్‌తో కూడిన వ్యవహారం. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని రోజుల్లో.. తెల్లదొరలు భూములను పకడ్బందీగా సర్వే చేయించి.. హద్దు రాళ్లు పాతించినట్లు రికార్డులు చెబుతున్నాయి. శతాబ్దం క్రితం నాటిన రాళ్లు ఇప్పుడు చాలాచోట్ల కనిపించడం లేదు. ఫలితంగా వాగులు, వంకలు, చెరువులు, వేల ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు.. బలవంతులు, రాజకీయ నేతల ఆక్రమణల్లోకి వెళ్లాయి. ఇవి కాక కింది స్థాయి కోర్టుల నుంచి సర్వోన్నత న్యాయస్థానం వరకు భూ వివాదాలకు సంబంధించిన కేసులు పేరుకుపోయాయి.
అంతేకాదు, ఉమ్మడి రాష్ట్రంలో వీటి సంఖ్య 6 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. కోర్టులకు వచ్చే సివిల్ వివాదాల్లో భూముల సమస్యలే అధికంగా ఉన్నాయని.. రెవెన్యూశాఖ తప్పిదాలతోనే ఈ వివాదాలు తలెత్తుతున్నట్లు అనేకసార్లు న్యాయనిపుణులు హెచ్చరించారు. వీటి పరిష్కారం కోసం ప్రభుత్వం రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ రీసర్వే.. అన్నదాతలకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది.
అనంతపురం జిల్లాలో మొత్తం 503 గ్రామాలుండగా.. తొలి దశలో 61 రెవెన్యూ గ్రామాల్లో జగనన్న భూ హక్కు, భూ రక్ష పథకం పేరిట రీసర్వే చేపట్టాలని నిర్ణయించారు. వీటిలో 53 గ్రామాల్లో డ్రోన్ ద్వారా భూ సరిహద్దులు గుర్తించారు. 41 గ్రామాల్లో హద్దు రాళ్లు పాతారు. సత్యసాయి జిల్లాలో 461 గ్రామాలకు గాను రెండు విడతల్లో 80 గ్రామాల్లో రీ సర్వే చేశారు. వీటిలో 30 గ్రామాల్లో హద్దు రాళ్లు పాతారు. భూములు సర్వే చేసే సమయంలో ఆయా సర్వే నెంబర్ల రైతులతో పాటు, పొరుగునున్న సర్వే నెంబర్ల భూ యజమానులను క్షేత్రస్థాయికి పిలవాలి. కానీ సర్వే అధికారులు ఈ ప్రాథమిక సూత్రానికి తిలోదకాలు వదిలారు. ఇది గ్రామాల్లో మరింతగా భూ వివాదాలను పెంచే వ్యవహారంగా మారింది. సర్వే పూర్తైందని సీఎం జగన్ ఫోటో ముద్రించిన పట్టాదారు పాసుపుస్తకాలు .. రైతులకు పంపిణీ చేస్తున్నారు. వీటిలో విస్తీర్ణంలో తేడాలతో పాటు రైతుల పేర్లు సైతం తప్పుగా ఉంటున్నాయి. వీటిని పరిష్కరించే యంత్రాంగం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు.
సర్వే నెంబర్‌లోని సబ్ డివిజన్‌లో అసలు విస్తీర్ణం కంటే అధికంగా ఉండడం.. కచ్చితమైన విస్తీర్ణంతో హద్దుల గుర్తింపును రైతులు ఒప్పుకోకపోవడంతో సమస్య పరిష్కారం మాట అటుంచి కొత్త వివాదాలు తలెత్తుతున్నాయి. పట్టాదారు పాసు పుస్తకాల్లో సైతం భూమి విస్తీర్ణం చూపకపోవడం వల్ల.. వాటినీ విక్రయించలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. రీ-సర్వే పూర్తి చేసిన గ్రామాల్లో సైతం వివాదాలు పరిష్కారం కావడం లేదు. రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇవీ చదవండి