Hyderabad Land Issue: అనంతపురం జిల్లా తాటిచెర్లకు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి హైదరాబాద్ శివారులోని తారామతిపేటలో 3.3 ఎకరాలు గతంలో కొనుగోలు చేశారు. ఈ భూమిని 2019లో హైదరాబాద్‌కు చెందిన అశోక్‌రెడ్డికి విక్రయించారు. అడ్వాన్స్‌గా 1.24 కోట్లు తీసుకున్న భూమి యజమాని మిగిలిన సొమ్ము రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే అనుకున్న సమయానికి అశోక్‌రెడ్డి రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు.
ఏడాది క్రితం అశోక్‌రెడ్డి రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రయత్నించగా అనంతపురం జిల్లాకు చెందిన భూ యజమాని అంగీకరించలేదు. గతంలో ఇచ్చిన అడ్వాన్స్ సొమ్ము సైతం తిరిగి ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. దీంతో అశోక్‌రెడ్డి హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రజాప్రతినిధి ద్వారా రాప్తాడు వైసీపీ నేతను సంప్రదించారు. సదరు ప్రజాప్రతినిధి తన సోదరుడిని రంగంలోకి దింపారు.
గురువారం రాత్రి తాడిచర్లలోని భూ యజమాని ఇంటికి వెళ్లి అర్థరాత్రి వరకు చర్చలు జరిపారు. రిజిస్ట్రేషన్ చేసేందుకు భూ యజమానులు అంగీకరించకపోవడంతో వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. చెప్పినట్లు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం. అర్థరాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో నుంచి మహిళల కేకలు వినిపించడంతో గ్రామంలో అంతా ఉలిక్కిపడ్డారు. అయితే ఈ విషయంలో భూమి యజమానులు ఎక్కడా ఫిర్యాదు చేయలేదు. తమను ఎవరూ బెదిరించలేదని కేవలం రిజిస్ట్రేషన్‌కు సంబంధించి చర్చించడానికే వచ్చారని బాధిత కుటుంబం చెప్పడం గమనార్హం. వైసీపీ నాయకుడికి భయపడే విషయం బయటకు చెప్పడానికి ధైర్యం చేయడం లేదని తెలుస్తోంది.
ఇవీ చదవండి