కరవు జిల్లా ఆయకట్టుకు గుండెకాయ లాంటి తుంగభద్ర జలాశయం నిండుకుండను తలపిస్తోంది. 2 దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంతగా ఎగువ నుంచి ప్రవాహాలు రావడం వల్ల... ఇప్పటికీ టీబీ డ్యామ్‌లో గరిష్ట నీటిమట్టం ఉంది. గత ఏడాది నవంబర్ నెలాఖరు నాటికి ఆనకట్టలో 53 టీఎంసీల నీటి నిల్వ ఉంటే... ఈ ఏడాది 96 టీఎంసీలకు నీటిమట్టం చేరింది. తాజాగా తుంగభద్ర జలాశయం నీటి పంపకాలపై నిర్వహించిన సమావేశంలో... రాష్ట్రానికి మూడున్నర టీఎంసీలు అదనంగా ఇవ్వాలని నిర్ణయించారు. దీనివల్ల ఆయకట్టు పరిధిలోని పంటలకు నీరు అందనుంది.
ఒకప్పుడు నైరుతి రుతుపవనాలు ఆగమనానికి ముందు తుంగభద్ర జలాశయంలో కేవలం రెండున్నర టీఎంసీలే నీటి నిల్వ ఉండేది. కర్నూలు జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు నీటిని వదిలేస్తే... అనంతపురం జిల్లా ప్రజలకు తాగటానికీ నీరు దొరికేది కాదు. ఈ పరిస్థితితో ఆ ప్రాంతవాసులు ఎప్పుడూ ఆందోళన చెందేవారు. ఈ ఏడాది ఏకధాటిగా కురిసిన వర్షాలకు 2 రోజుల్లోనే టీబీ డ్యాం నిండి... రైతుల ముఖాలు సంతోషంతో కళకళలాడుతున్నాయి.
జలాశయం పరివాహక ప్రాంతాల్లోని కర్ణాటకకు చెందిన రైతులు దాదాపు 10 టీఎంసీల వరకూ జలచౌర్యానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. టీబీ బోర్డుకు కొత్తగా వచ్చిన అధికారులు జలచౌర్యాన్ని ఆధారాలతో సహా చూపించారు. అందువల్ల 2 టీఎంసీల నీటిని చౌర్యం చేసి రైతులు వాడుకుంటున్నట్లు కర్ణాటక ఇంజినీర్లు ఒప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా నిర్వహించిన సమావేశంలో 11 టీఎంసీలు చౌర్యానికి గురవుతున్నట్లుగా ఆధారాలతో సహా బోర్డు అధికారులకు హెచ్ఎల్సీ ఎస్‌ఈ రాజశేఖర్ లేఖ పంపించారు. దీనిపై గట్టి వాదన జరగటంతో... ఆంధ్రప్రదేశ్‌కు మూడున్నర టీఎంసీల నీరు అదనంగా ఇచ్చేలా బోర్డు చర్యలు తీసుకుంది. ఇందులో అనంతపురం జిల్లాకే ఒకటిన్నర టీఎంసీలు అదనంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా అనంతకు 26.5 టీఎంసీల నీళ్లు అందనున్నాయి. టెలీమీటర్లు ఏర్పాటు చేశాక కర్ణాటకలో జలచౌర్యాన్ని గుర్తించగలిగామని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి సైబర్ మోసగాళ్లను నమ్మితే... సర్వం సమర్పయామి..!