రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. బాపట్ల, అనంతపురం, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. బాపట్ల జిల్లాలోని కడవకుదురు-పందిళ్లపల్లి మధ్య జాతీయ రహదారి వెంట ఉన్న 25 జమాయిల్ భారీ వృక్షాలు కూలి.. రహదారికి అడ్డంగా పడిపోయాయి. చినగంజాం ఉప్పుకొఠార్లలో ఉన్న విద్యుత్ పరివర్తకంతోపాటు.. 10 విద్యుత్ స్తంభాలు సైతం పెనుగాలికి కూలిపోయాయి. దీంతో చీరాల, వేటపాలెం, చినగంజాం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
అనంతరపురం జిల్లా విడపనకల్ మండలం పాల్తూరులో కురిసిన గాలివానకు.. గ్రామంలోని చెట్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయి. ఆటోలు, ద్విచక్ర వాహనాలపై చెట్లు విరిగి పడటంతో వాహనాలు దెబ్బతిన్నాయి.
గుంటూరు జిల్లా భీమినేనివారి పాలెంలో ఈదురు గాలలకు ప్రధాన రహదారిపై చెట్టు నేలకొరిగింది. దీంతో.. కాసేపు రాకపోకలు నిలిచిపోయాయి. జేసీబీ సాయంతో చెట్టుని తొలగించడంతో రాకపోకలు కొనసాగించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం రాజపాలెం గ్రామంలో ఈదురుగాలుల బీభత్సానికి జాతీయ రహదారిపై చెట్లు నేలకొరిగాయి. కేశినేనిపల్లిలో ఓ ఇంటి పైరేకులు ఎగిరిపోయాయి.
ఇదీ చూడండి..