సమస్యలు చుట్టుముట్టినా.. ఆ రైతుకు చీకట్లు కమ్ముకోలేదు. చీకటి అవతల ఉన్న.. వెలుతురును చూశాడు. పరిస్థితులు దివ్యాంగుడిని చేసినా... అదేం పెద్ద సమస్య కాదన్నట్టు.. ఒంటి చేత్తో పొలం దున్నుతాడు. తన పనులు తానే చేసుకుంటాడు.. అనంతపురానికి చెందిన ఓ అన్నదాత.
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం డొనేకల్లుకు చెందిన రైతు నబీరసూల్ ఒంటిచేత్తో పొలం దున్నుతాడు. అంగవైకల్యంలోనే అవకాశాన్ని సృష్టించుకున్నాడు. రసూల్ జీవితంలో అన్ని సక్రమంగా జరుగుతున్న సమయంలో ఓ ప్రమాదం జరిగింది. తనకు జీవనోపాధినిచ్చే.. పిండి మిషన్లో అనుకోకుండా తన కుడిచేయి ఇరుక్కుని.. తెగిపోయింది. అయినా కుంగిపోలేదు. ఒక్క చేయితోనే అద్భుతంగా వ్యవసాయం చేస్తున్నాడు. అన్ని పనులు తానే చేసుకుంటున్నాడు.
తనకున్న ద్విచక్ర వాహనాన్ని.. వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకున్నాడు. ఇక దానితోనే.. పొలంలో దున్నుతున్నాడు. చుట్టుపక్కల రైతులతో శభాష్ అనిపించుకుంటున్నాడు రసూల్. ఏదైనా చేయాలనే పట్టుదల ఉంటే.. అంగవైకల్యం ఉన్నా చేయోచ్చని నిరూపిస్తున్నాడు.
ఇదీ చదవండి: సీఆర్డీఏపై హైకోర్టు స్టే వెకేట్ చేయాలని సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్