ఇంటి పట్టా కోసం ఓ కుటుంబం అనంతపురం జిల్లా కదిరిలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టింది. మున్వర్ బాషా అనే వ్యక్తి తన భార్య, నలుగురు పిల్లలతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఇంటి పట్టా కోసం ఆరు నెలలుగా సచివాలయం, మున్సిపల్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
'మొదట మేము కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో అద్దె ఇంట్లో నివాసమున్నాం. అనంతరం అక్కడినుంచి కదిరి పట్టణంలోని బేరిపల్లి కాలనీకి మారాం. ఇంటి పట్టా పొందేందుకు దరఖాస్తు చేసుకోగా... నేను అర్హుడినని తహసీల్దార్ గుర్తించారు. దరఖాస్తును పరిశీలించాలని కిందిస్థాయి అధికారులకు సూచించారు. దరఖాస్తును తీసుకున్న వార్డు సచివాలయ సిబ్బంది నా రేషన్ కార్డు కదిరి రూరల్ మండలంలో ఉన్నందున తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. కుమ్మరవాండ్లపల్లి గ్రామ సచివాలయానికి దరఖాస్తుతో వెళ్లినా అక్కడ కూడా నిరాశే మిగిలింది. గ్రామ సచివాలయ సిబ్బంది.. మీ రేషన్ కార్డు ఈ జిల్లాకు సంబంధించినది కాదంటూ తిరస్కరించారు. మరో దారి లేక కుటుంబంతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నా' -మున్వర్బాషా, బాధితుడు
ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.
ఇదీ చదవండి