పరిశ్రమలతో కరవు జిల్లా అనంత పరిగి మండలంలో ముంబయికి చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ పరిశ్రమ కోసమని రైతుల నుంచి 30 వేల ఎకరాలు సేకరించింది. కానీ నేటికీ పరిశ్రమ ఏర్పాటుచేయలేదు. ఆర్థిక మండళ్లలలో పరిశ్రమలు తెస్తామని భూములు దక్కించు కొన్నా.. అడుగు ముందుకు పడలేదు. ఏపీఐఐసీ సేకరించిన భూములు బీళ్లుగా మారుతున్నాయి. జిల్లాలో ఐదు లక్షల మందికి ఉద్యోగాలు చూపుతామన్నారు. చాలా మంది రైతులు భూములు కోల్పోయారు. లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలు అడియాశలయ్యాయి. ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. ఇదీ అనంత పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ పరిధిలో సేకరించిన భూముల పరిస్థితి.
- రూ.25 వేల కోట్లతో లేపాక్షి హబ్ ఏర్పాటు చేస్తాం. 41 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తెస్తాం. 1.50 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని లేపాక్షి ఎండీ తెలిపారు.
ప్రస్తుతం: నేటికీ కలగానే మిగిలింది
- తూమకుంట పారిశ్రామిక వాడలో 350 ఎకరాల్లో రహేజా కంపెనీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. కాంగ్రెస్ హయాంలో భూమిపూజ కూడా చేశారు. ఇక్కడ 25వేల కోట్లతో పరిశ్రమ నెలకొల్పి ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.
- పారిశ్రామికవాడలో రహెజా సంస్థకు 12ఏళ్ల కిందట 350 ఎకరాలు కేటాయించారు. 25 వేల కోట్లతో పది వేల మందికి ఉపాధి చూపుతామన్నారు. ఎలాంటి ఉపాధి చూపలేదు.
విమానాల పరిశ్రమకు రెక్కలు..
విమానాల తయారీ పరిశ్రమ అన్నారు.. ఎలెక్ట్రానిక్ సిటీ అన్నారు.. కాంగ్రెస్ హయాంలో రంగుల ప్రపంచం చూపారు. ఇంకేముందని రైతులు తమ భూములను నాడు ప్రభుత్వానికి ఎకరం రూ.1.75లక్షలతో అప్పగించారు. ఏపీఐఐసీ ద్వారా 22,500 ఎకరాలు గుర్తించగా.. 17,500 ఎకరాలు చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో సేకరించగా అందులో లేపాక్షి హబ్ అన్ని ఖర్చులు కలిపి రూ.120కోట్లకు 8,844 ఎకరాల భూమిని మూడు విడతలుగా కట్టబెట్టారు. అప్పట్లో ఏకంగా భూములను ఏపీఐఐసీ అధికారులు రిజిస్ట్రేషన్ చేసిచ్చారు. అలా దక్కించుకొన్న భూములు బెంగళూరులోని పలు బ్యాంకుల్లో రూ.790కోట్లకు తాకట్టు పెట్టారు. తరువాత ఈ భూములు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల చేతుల్లోకి వెళ్లాయి. దీంతో పరిశ్రమలు రాక, తక్కువ ధరకు భూములు అమ్ముకొన్న రైతుల కుటుంబాల్లో పిల్లలకు ఉపాధి లేక బెంగళూరులో పనులకు వెళ్లక తప్పలేదు.
ఇదీ పరిస్థితి..
- హిందూపురం పారిశ్రామికవాడ మౌలిక సదుపాయాల సంస్థ పరిధిలో హిందూపురం, పరిగి, చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో 24,995 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు సేకరించారు. ఇందులో గోరంట్ల, చిలమత్తూరు మండలాల్లో 22,400ఎకరాలు, పరిగి మండలంలో 1300ఎకరాలు, హిందూపురం రూరల్ మండలంలో 1,800 ఎకరాలు ఇప్పటి వరకు పరిశ్రమల కోసం సేకరించారు.
- హిందూపురం పారిశ్రామికవాడలో గతంలో నెలకొల్పిన కర్మాగారాలు.. ప్రస్తుతం గోళ్లాపురం వద్ద 950 ఎకరాల్లో ఇనుము కర్మాగారాలు, బర్జర్ పెయింట్స్, టెక్స్‌టైల్ పరిశ్రమలు మినహా మరెక్కడా కొత్తగా వచ్చిన పరిశ్రమలు లేవు.
- పారిశ్రామిక వాడలో టెక్‌పార్క్, సడ్లపల్లి వద్ద గార్మెంట్స్ పరిశ్రమల్లో మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఇక్కడేమీ ప్రత్యేకించి ఎవరూ ఉద్యోగాలు పొందలేదు.
- పరిగి మండలంలో రసాయి ప్రాపర్టీస్ పేరుతో ప్రభుత్వ, ప్రైవేటు భూములు 1300ఎకరాలు సేకరించారు. పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ 250 ఎకరాలు కేటాయించగా, ముంబయికి చెందిన కంపెనీ ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా మరో 1050 ఎకరాలు కొనుగోలు చేసింది. నేటికీ అక్కడ పరిశ్రమలకు పునాది రాయి మాత్రం పడలేదు.
- హిందూపురం జిల్లా అవుతుందన్న ఊహాగానాల మధ్య ఇప్పుడైనా హిందూపురం పారిశ్రామిక వాడకు దశ తిరగనుందా అన్న చర్చలు సాగుతున్నాయి. ప్రజా ప్రతినిధులు ఆ దిశగా అడుగులు వేయాల్సి ఉంది.
ఉపాధి ఎక్కడ?
పరిశ్రమలు తెస్తాం. జిల్లాలో ఐదు లక్షల మందికి ఉపాధి చూపుతాం అన్న ప్రజాప్రతినిధులు.. ఆ హామీని నెరవేర్చలేకపోయారు. ఎంతో మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూశారు. పదేళ్లు గడుస్తున్నా.. ఆచరణకు నోచుకోవడం లేదు. భూములు కోల్పోయిన రైతులు తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందనుకొన్నా.. అది కలగానే మిగిలిపోయింది. యువత బెంగళూరు, చెన్నె, హైదరాబాద్ నగరాలకు వలసలు వెళ్తున్నారు.
పరిశ్రమల స్థాపనకు చర్యలు
పరిశ్రమలకు అవసరమైన భూములు సేకరించడం, ప్రస్తుతం మరింత భూమి తీసుకొనేందుకు చర్యలు తీసుకొంటున్నాం. తప్పక పరిశ్రమలు రానున్నాయి. ఆ దిశగా చర్యలు తీసుకొంటున్నాం.
- కరికాల వలవన్, ఏపీ ఐఐసీ ఎండీ