అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం సర్.సి.వి.రామన్ ఇంజినీరింగ్ కళాశాలలో... 'ఈనాడు-ఈటీవీభారత్' ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇటీవల మహిళలు, విద్యార్థులపై జరుగుతున్న హత్యాచారాల నుంచి ఎలా తప్పించుకోవాలి, ఆపదలో ఉన్నవారిని ఎలా రక్షించాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు, వ్యక్తిత్వ వికాస నిపుణురాలు స్వప్న హాజరయ్యారు. పోలీసుశాఖ ద్వారా అందిస్తున్న సేవల గురించి, చారవాణుల ద్వారా ఎలా ఫోన్ చేయాలి అనే అంశాల గురించి వివరించారు.
ఉరవకొండ పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు అవగాహన కల్పించారు. తెలంగాణలో పశు వైద్యురాలు మృతి పట్ల సంతాపం తెలిపారు. యువతులు సమాజంలో ఎలా ఉండాలి, ఎవరైనా దాడి చేస్తే తక్షణమే ఏమి చేయాలి, అత్యవసర సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలపై వివరించారు. ప్రమాదం అని తెలిసిన వెంటనే అత్యవసర నంబర్లకు సమాచారం ఇస్తే... 6 నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకొని ఆపదలో ఉన్న వారిని రక్షిస్తామని ఉరవకొండ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అనంతపురంలోని కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాలలో 'ఈనాడు-ఈటీవీభారత్' ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణలో జరిగిన యువతి హత్యను ఖండిస్తూ... ఆమె ఆత్మకు శాంతి కలగాలని విద్యార్థులు, అధికారులు నివాళులర్పించారు.