ED raids in telangana : తెలంగాణలో వరుసగా తెరాస నాయకుల ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయి. బుధవారం రోజు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఇల్లు, కార్యాలయాలపై ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తెరాస ఎంపీ గాయత్రి రవి ఆఫీసులో 11 గంటలుగా సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్ కార్యాలయంలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. తమ పార్టీ నాయకులనే ఈడీ, ఐటీ అధికారుల టార్గెట్ చేస్తుండటంతో తెరాస నేతల్లో కలవరం నెలకొంది.
ED raids in Hyderabad : బుధవారం రోజున రాష్ట్రంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ, ఆదాయ పన్ను-ఐటీ శాఖ అధికారుల తనిఖీలు జరిగాయి. ఓవైపు క్రితం దిల్లీ మద్యం కుంభకోణం కేసులో తనిఖీలు, విచారణ కొనసాగుతుండగానే.. తాజాగా కొన్ని గ్రానైట్ సంస్థలు అక్రమాలకు పాల్పడ్డాయన్న ఆరోపణలతో ఈడీ, ఐటీ శాఖ అధికారులు రాష్ట్రంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
కరీంనగర్‌లోని 9 గ్రానైట్ సంస్థలు అక్రమాలకు పాల్పడ్డాయని పేరాల శేఖర్ రావు.. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఎన్జీటీ, కేంద్ర పర్యావరణశాఖకు... గతేడాది ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వివరాలను దర్యాప్తు సంస్థలకు అందించారు. అదే విషయంపై 2019లో బండి సంజయ్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ రెండు ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈడీ, ఐటీ శాఖ అధికారులు 20 బృందాలుగా విడిపోయి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మంలోని గ్రానైట్ సంస్థల యజమానుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ సోమాజీగూడలోని.. పీఎస్ఆర్ గ్రానైట్స్ కార్యాలయం, హైదర్‌గూడ ఉప్పరపల్లిలోని.. ఎస్వీజీ గ్రానైట్స్ అధినేత ఇళ్లు, కార్యాలయంలో సోదాలు చేశారు.