కల్తీ కల్లు వల్ల రోజుకి పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నా అనంతపురం జిల్లాలో కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దులో పెద్దఎత్తున వ్యాపారం జరుగుతోంది. ఈక్రమంలో కొందరు అక్రమార్కులు కల్తీ కల్లు తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనలు పక్కనపెట్టి, ఈత చెట్లతో పనిలేకుండా రసాయనాలతో కల్లును తయారు చేసే కేంద్రాలు పుట్టుకొచ్చాయి. కల్తీ కల్లు తాగి పలువురు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం కల్తీ కల్లు తాగి అయిదుగురు మృతి చెందారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.
అనంతపురం జిల్లాలో ఒకప్పుడు కల్లుకు దుకాణాలు తక్కువగానే ఉండేవి. అయితే ఇటీవల డిమాండు ఏర్పడింది. జిల్లా సరిహద్దులో కర్ణాటక సమీపాన గిరాకీ పెరిగింది. ఎందుకంటే కర్ణాటకలో కల్లుపై నిషేధం ఉంది. సరిహద్దు ప్రాంతాలైన హిందూపురం, పరిగి, మడకశిరలో కల్లు దుకాణాలు ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి. వాటికి పెద్ద ఎత్తున కల్తీ కల్లు సరఫరా అవుతున్నట్లు సమాచారం. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 300దుకాణాలకు అనుమతులు ఉన్నాయి. అనుమతిలేనివి రెట్టింపు సంఖ్యలో నడుస్తున్నాయి.
తయారీ.. సరఫరా ఇలా..
సాధారణంగా ఒక్కో దుకాణానికి 30 చొప్పున ఈత చెట్లు గీసుకోవడానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తుంది. వీటిని రోజు మార్చి రోజు గీసి వాటి నుంచి వచ్చిన కల్లును దుకాణాలకు సరఫరా చేస్తారు. సగటున ఒక్కో చెట్టు 3 నుంచి 4 లీటర్ల కల్లు ఇస్తుంది. జిల్లాలో మాత్రం నిత్యం వందల లీటర్ల కల్లు విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో కృత్రిమ (కల్తీ) కల్లు తయారీకి మొగ్గు చూపుతున్నారు. ఈ వ్యాపారం లాభసాటిగా ఉండటంతో బడా వ్యక్తులు రంగంలోకి దిగారు. వ్యవసాయ తోటల్లో కల్తీకల్లు తయారు చేసి, వాహనాల్లో దుకాణాలకు తరలిస్తున్నారు.
ఆరోగ్యంపై ప్రభావం...
కల్లు తయారీలో తియ్యదనానికి చక్కెర, శాకరిన్లు, చిక్కదనానికి స్టార్చ్ పొడి, మత్తును కల్గించేందుకు ‘డైజీపామ్’ను కలుపుతున్నారు. ఇవి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కల్తీ కల్లు ఎక్కువకాలం సేవిస్తే కాలేయం, మూత్రపిండాలు పాడవుతాయి. కంటి చూపు తగ్గి, శరీర అవయవాలు క్షీణించి మరణం సంభవిస్తుంది. జిల్లా సరిహద్దు గ్రామాల్లో కూడా గత కొంతకాలంగా ఇలాంటి మరణాలు జరుగుతున్నాయని ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. లేపాక్షి, మైదుగోళం ప్రాంతాల్లో కల్తీ కల్లుకు పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
లైసెన్సుల మాటున..
జిల్లాలో పెద్ద ఎత్తున లైసెన్సులు తెచ్చుకున్నారు. లెసెన్సు మాటున కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్సైజ్ నిఘా విభాగం అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా.. పైరవీలు చేసి తిరిగి అనుమతులు తెచ్చుకుంటున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని కొడిమి, కమ్మూరు, కురుగుంట, ఆలమూరు ప్రాంతాల్లో సైతం కృత్రిమ కల్లును అమ్ముతున్నట్లు సమాచారం. నిఘా లేకపోవడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ఇదీ చదవండి:ఈనెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లడం ఖాయం: ఉద్యోగులు