అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని వెలుగు కార్యాలయంలో వెలుగు సీసీ రామ్మోహన్‌పై ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. రామ్మోహన్ 9 నెలల క్రితం తాడిమర్రి నుంచి బదిలీపై తాడిపత్రి వెలుగు కార్యాలయానికి వచ్చాడు. తాడిమర్రిలో విధులు నిర్వహించే సమయంలో అక్కడికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉండేది. ఈ విషయమై మహిళ భర్త, బంధువులు పలుమార్లు రామ్మోహన్‌ను మందలించారు. అయినప్పటికీ రామ్మోహన్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తాడిమర్రి నుంచి మహిళ భర్త రాజారెడ్డి, సమీప బంధువైన రామలింగారెడ్డితో కలిసి తాడిపత్రి వెలుగు కార్యాలయంలోకి వచ్చారు. రామ్మోహన్‌తో వాగ్వాదానికి దిగి తమతో తెచ్చుకున్న వేట కొడవళ్ళతో దాడికి దిగారు.
అక్కడే ఉన్న కొందరు స్థానికులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రామ్మోహన్ రాజారెడ్డి చేతిలోని కొడవలి లాక్కొని రాజారెడ్డి చేతిపై దాడికి పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పట్టణ పోలీసులు వెలుగు కార్యాలయం వద్దకు వచ్చారు. పారిపోతున్న రాజారెడ్డిని అదుపులోకి తీసుకునని ఆసుపత్రికి తరలించారు. పరారిలో ఉన్న మరో నిందితుడు రామలింగారెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే తీవ్ర గాయాలయ్యి రక్తపు మడుగులో ఉన్న రామ్మోహన్ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రామ్మోహన్ పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం పంపించారు.
ఇదీ చూడండి ప్రియుడే అల్లుడు... విషయం తెలిసి నవవధువు ఆత్మహత్య