రాష్ట్రంలో కరోనా వ్యాప్తి రెండో దశకు చేరటంతో ప్రభుత్వం నిన్న లాక్డౌన్ ప్రకటించింది. అత్యవసర మినహా బస్సు, రైళ్ల రాకపోకలను నిలిపివేయటంతో పక్క రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు చేరుకునే తెలుగు వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అనంతపురం జిల్లాలోని మడకశిర నియోజకవర్గం.... బెంగళూరు మహానగరానికి సమీపంలో ఉంది. మడకశిర ప్రాంతంలోని ప్రజలు చాలా మంది ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లారు. కరోనా వ్యాప్తి కారణంగా బెంగళూరులోని పారిశ్రామిక కేంద్రాలు మూత పడ్డాయి. ఫలితంగా వలస వెళ్లిన ప్రజలు తిరిగి వారి స్వస్థలాలకు చేరుకునేందుకు బయల్దేరారు. బస్సులు, రైళ్లు లేకపోవటంతో ఆటోల సహాయంతో, ద్విచక్ర వాహనదారుల సహాయంతో రాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి నుంచి తిరిగి వారి గమ్యస్థానాలకు చేరేందుకు చెక్పోస్ట్లోని పోలీసులు ఆటోలో ప్రయాణించేందుకు నిరాకరించటంతో మండుటెండలో మహిళలు, ముసలివారు కాలినడకతో వెళ్తున్నారు. కొంత మంది ఆటో డ్రైవర్లు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను పట్టించుకోకుండా అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకొని తరలిస్తున్నారు.
ఉగాది పండగ సందర్భంగా బెంగళూరు, తుమకూరు నగరాల నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామంటూ ప్రయాణికులు చెప్తున్నారు. తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఏ సౌకర్యం లేనందున కాలినడకతో వెళుతున్నట్లు వివరించారు. అధికారులు చొరవ చూపి ప్రజలకు ఇబ్బంది లేకుండా వారి గమ్యస్థానాలకు వెళ్లేందుకు తగు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరారు.