అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చుక్కలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ, మగ శిశువు మృతి చెందారు. మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
సులోచన మూడో ప్రసవం కోసం చుక్కలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చారు. ఈనెల 22వ తేదీన ఆమె ప్రసవిస్తుందని వైద్యులు నిర్థరించారు. 21వ తేదీ వరకు పురిటి నొప్పులు రాకపోవటం వల్ల ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు అనంతపురం తీసుకెళ్లాలని సూచించారు. కానీ వాళ్లు తిరిగి ఇంటికి వెళ్లారు. శుక్రవారం సాయంత్రం నొప్పులు రావటంతో చుక్కలూరు ఆసుపత్రికి వచ్చారు.
పండగ సెలవు కావడం వల్ల ఆసుపత్రిలో సిబ్బంది ఎవరూ లేరు. సమాచారం అందుకున్న ఏఎన్ఎం ప్రసవం చేయగా చనిపోయిన శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం సులోచనను తాడిపత్రి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి బంధువులు మృతదేహాలతో ఆందోళనకు దిగారు. పోలీసులు, వైద్యులు న్యాయం చేస్తామని హామీతో ఇవ్వడంతో ధర్నా విరమించారు.
ఇదీ చూడండి కాపురానికి పంపడం లేదని కారుతో తొక్కించాడు..!