CPI Ramakrishna: తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్రంగా నష్టపోయినా... సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రావటంలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. వర్షాలు లేక ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతులు లక్షా 30 వేల ఎకరాలను బీడు పెట్టారని ఆరోపించారు. బటన్లు నొక్కే సీఎం వైఎస్ జగన్‌కు కరవు పరిస్థితులు కనిపించటం లేదా అని ప్రశ్నించారు. శ్రీ సత్యసాయి జిల్లా సీకే పల్లి, రాప్తాడు, అనంతపురం జిల్లా గార్లదిన్నె, గుత్తి మండలాల్లో రామకృష్ణ పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ఎండిపోయిన వేరుశెనగ, పత్తి, కంది, ఆముదం పంటలను రామకృష్ణ పరిశీలించారు.
దిక్కుతోచని పరిస్థితిలో రైతులు: జిల్లాల్లో సరైన సమయంలో వర్షాలు కురవక పోవటంతో సుమారు 1.30 లక్షల హెక్టార్లలో రైతులు విత్తనం వేయకుండా భూములు బీడు పెట్టారని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు సాగుచేసిన రైతులు వర్షాభావంతో పూర్తిగా పెట్టుబడిని కోల్పోయారని పేర్కొన్నారు. ఈ సందర్భగా పలువురు రైతులు మాట్లాడారు. పంట చేతికొచ్చే సమయంలో సరైన వర్షాలు లేక వేరుశనగ తో పాటు ఇతర పంటలు పూర్తిగా ఎండిపోయాయని తెలిపారు. ఆ పంటలను ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదంటూ... రైతులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
రైతుల సమస్యలు వినటానికి తీరిక లేదన్న మంత్రి పెద్దిరెడ్డి: సీపీఐ నేతలు.. పంట కోల్పోయిన రైతులతో మాట్లాడి పెట్టుబడి వివరాలు తెలుసుకున్నారు. అనంతపురంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం నిర్వహిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వద్దకు వెళ్లారు. రైతులకు జరిగిన నష్టాన్ని వివరించటానికి ప్రయత్నించారు. ఏ మాత్రం దిగుబడి లేని వేరుశెనగ చెట్లను తీసుకొని రామకృష్ణతో పాటు ఆ పార్టీకి చెందిన నాయకులు సమావేశం వద్దకు వెళ్లినప్పటికీ, కలవటానికి తీరకలేదని మంత్రి పెద్దిరెడ్డి పోలీసులకు చెప్పి పంపారు. దీంతో వెంట తీసుకెళ్లిన వేరుశెనగ కట్టెను గేటు ఎదుట పడేసి రామకృష్ణ బృందం తిరిగి వెళ్లింది. రైతుల సమస్యలు వినటానికి మంత్రికి తీరిక లేదని రామకృష్ణ విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కనీసం రైతుల పొలాల వైపు కన్నెత్తి చూడటంలేదని ఆరోపించారు.
'వేరుశెనగ, పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు 50,000 రూపాయల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలి. అనంతపురం జిల్లా వ్యాప్తంగా సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంటలు సాగుచేసిన రైతులు లక్షల్లో నష్టపోయారు. నష్టపోయిన రైతులకు తక్షణమే ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలి'. కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి