వారం రోజులుగా అనంతపురం జిల్లాలో నమోదవుతున్న కొవిడ్ కేసుల సంఖ్య ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు వైరస్ బాధితుల సంఖ్య 1320 కి చేరినట్లు అధికారులు చెప్పారు. వీరిలో 850 మంది ప్రస్తుతం చికిత్సలో ఉన్నారు. అయితే బాధితుల్లో చాలామంది ఆసుపత్రిలో చేరటానికి సిద్ధమైనప్పటికీ పడకల సంఖ్య తక్కువగా ఉండటంతో ఇంటివద్దనే ఉంచినట్లు కొందరు అంటున్నారు.
జిల్లాలో అనంతపురం, హిందూపురం, బత్తలపల్లిలో కొవిడ్ ఆసుపత్రులను నిర్వహిస్తుండగా పరిమిత సంఖ్యలో పడకలు ఏర్పాటు చేసి అత్యవసర వైద్యం ఉన్నవారిని మాత్రమే చికిత్సకు తరలిస్తున్నారు.
అనంతపురం నగరంలోనే వారం రోజుల్లోనే ఐదు వందల మందికి పైగా వైరస్ విస్తరించినట్లు తెలుస్తోంది. నగరంలోని పాతూరులో వైరస్ జడలు విప్పుతున్నప్పటికీ జిల్లా యంత్రాంగం అక్కడి ప్రజలను అప్రమత్తత చేయటంలో పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కర్ణాటకలోని బెంగుళూరు, పావుగడ ప్రాంతాల నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తున్న వారి నుంచి సరిహద్దు గ్రామాల్లో వేగంగా బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా వచ్చిన నివేదక మేరకు తాడిపత్రి, శింగనమల, ధర్మవరం, యాడికి మండలాల్లోనే 40 మందికి కొత్తగా వైరస్ సోకింది.
జిల్లాలో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని వైద్య వర్గాలు కోరుతున్నాయి. కేసులు మరిన్ని పెరిగితే వైద్యులు, సిబ్బంది కొరత కూడా తలెత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి