అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే జంక్షన్లో కరోనా కలకలంతో అందరూ అప్రమత్తమయ్యారు. ముంబై నుంచి బెంగళూరు వెళ్తున్న లోకమాణ్యతిలక్ (ట్రైన్ నెంబర్ 11013 ) ఎక్స్‌ప్రెస్ ట్రైన్ బీ4 కోచ్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో తోటి ప్రయాణికులు గుంతకల్లు రైల్వే పోలీసులకు సమాచారమందించారు. హుటాహుటిన స్పందించిన అధికారులు బాధితుడికి పరీక్షలు నిర్వహించారు.
తోటి ప్రయాణికులు, రైల్వే టికెట్ కలెక్టర్ మొదటి నుంచి ఆ ప్రయాణికుడికి అస్వస్థతగా ఉన్నట్టు గమనించి అతనిని ఆరా తీయగా.... పది రోజులుగా జ్వరం, దగ్గు, జలుబు ఉన్నట్లు తెలిసింది. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించడానికి అధికారులు ఏర్పాటు చేయగా..ఆ ప్రయాణికుడు అందుకు అంగీకరించలేదు. అరగంటసేపు అధికారులు అతడిని బతిమాలి ఒప్పించి గుంతకల్లు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించారు. అనంతరం ఆ వ్యక్తి ప్రయాణిస్తున్న కోచ్‌లో ప్రయాణిస్తున్న మిగతా 24 మందిని బీ5, ఇతర కోచ్‌లలోకి పంపించి... బీ4 కోచ్‌లోకి ప్రయాణికులు ఎవరు వెళ్లకుండా తాళం వేశారు. అనంతరం రైలును శుద్ధి చేసి మందులు పిచికారీ చేసి రెండు గంటలు ఆలస్యంగా పంపించారు. అనుమానిత వ్యక్తిని గుంతకల్ ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డ్‌లో చికిత్స అందిస్తున్నారు.
ఇవీ చదవండి...తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్.. సిబ్బంది అప్రమత్తం