అనంతపురం జిల్లాలో రోజురోజుకూ ‘కరోనా’ మహమ్మారి విస్తరిస్తోంది. పాజిటివ్ కేసుల తీవ్రత రెట్టింపవుతోంది. రాష్ట్రంలో వైరస్ పెరుగుదల రేటు జిల్లాలో ఎక్కువగా నమోదవుతోంది. మార్చి 29న మొదటిసారిగా జిల్లాలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. అధికారిక గణంకాల ప్రకారం జిల్లాలో మొత్తం 40,155 మంది వైరస్ బారిన పడగా.. 323 మంది మృతి చెందారు. పాజిటివ్ కేసుల నమోదులో అనంత జిల్లా మూడో స్థానంలో ఉంది. వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్యలోనూ మూడో స్థానమే. మరణాల నమోదులో ఐదో స్థానంలో ఉంది. జులై, ఆగస్టు నెలల్లోనే ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు.
జూన్‌లో అన్‌లాక్ 0.1 ఆరంభంతో…ప్రజా రవాణాకు తెర తీశారు. దీంతో ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి రాకపోకలు మొదలయ్యాయి. జులైలో 13,010 మంది(32.4%) వైరస్ బారిన పడగా.. 106 మంది(32.82%) కన్నుమూశారు. ప్రస్తుత నెలలో ఏకంగా 25,456 మందికి(63.39%) కరోనా సోకగా… ఏకంగా 209 మంది(64.7%) బలయ్యారు. ఒక్క జులై, ఆగస్టు నెలల్లోనే 95.79 శాతం మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. మొత్తం 40,155 మంది బాధితుల్లో ఇప్పటి దాకా 33,929(84.49%) మంది పూర్తిగా కోలుకున్నారు. మరణించిన వారిలో కరోనాతో పాటు మధుమేహం, అధిక బరువు ఉండటం, రక్తపోటు, గుండెజబ్బు వంటి వ్యాధులు కూడా ఉన్నాయి.
8,401 పడకలతో జిల్లా వ్యాప్తంగా 16 కొవిడ్ ఆస్పత్రులు, 23 కొవిడ్ కేర్ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం 5,903 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో చాలా మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. రెండు వేల మంది దాకా ఆస్పత్రుల్లో, సీసీసీ కేంద్రాల్లో ఉన్నారు. వీరి వైద్య చికిత్సపై మరింత అప్రమత్తత అవసరం. ఐసీయూ, ఆక్సిజన్ పడకలపై చికిత్స పొందుతున్న వారి పట్ల ప్రత్యేక శ్రద్ధచూపాలి. అప్పుడే మరణాల రేటు తగ్గే అవకాశం ఉంది. నేటికీ కొన్ని ఆస్పత్రుల్లో వైద్య సిబ్బందిలో అలసత్వం కనిపిస్తోంది.
నియంత్రణపై తగ్గిన శ్రద్ధ తగ్గడంతో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ప్రభుత్వం డిశ్ఛార్జి సమయంలో అందించే రూ.2వేలు ప్రోత్సాహకం కూడా అందడం లేదు. పాజిటివ్ బాధితుల తరలింపులో పెద్దగా చర్యలు లేవు. స్వీయ గృహనిర్బంధంలో (హోమ్ ఐసోలేషన్) ఉన్న వారికి కనీస మందులు ఇవ్వలేదు. ఇటీవలే కొనుగోలు చేసిన 8వేల కిట్ల పంపిణీ వ్యవహారం ఎటూ తేలలేదు.
కాగా జిల్లాలోని 54 ప్రాంతాల్లో ఆదివారం మరో 695 కేసులు నమోదయ్యాయి. 7గురు మరణించినట్లు ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. ఈ కొత్త కేసులతో కలిపి మొత్తం 40,155 పాజిటివ్ కేసులు, 323 మంది మరణించారు. ఆదివారం 674 మంది డిశ్ఛార్జి అయ్యారు.
ఇవీ చదవండి: వ్యవసాయ ఉపకరణాలు అద్దె కేంద్రాలకు రూ.100 కోట్ల రుణం