ఓ ప్రేమ జంట చేసిన పనికి వారి ఇరు కుటుంబాల్లో పెద్ద గొడవలు జరిగిన ఘటన ఆదివారం రాత్రి ఉరవకొండ మండలం పెద్ద ముష్టూరులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. విషయం పెద్దలకు తెలిస్తే అంగీకరించరని తెలిసి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అంతే పెళ్లి వివషయం తెలిసిన పెద్దలు ఆగ్రహించారు. రెండు కుటుంబాలు తీవ్ర ఘర్షణకు దిగాయి.
ప్రేమికులు ఇద్దరు మేజర్లే. అందులోనూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. పెళ్లి చేసుకొని వస్తే పెద్దల్ని ఒప్పించవచ్చన్న ధీమాతో వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు, బంధువులు యువకుడి కుటుంబ సభ్యులతో తగాదా పెట్టుకున్నారు. రాత్రి తీవ్ర వాదన జరిగింది.
ఆగ్రహాన్ని పట్టలేక యువకుడి ఇంట్లో ఉన్న సామగ్రి, టీవీ ధ్వంసం చేశారు. వారి చేష్టలతో యువకుడి కుటుంబం ప్రతి దాడికి దిగింది. ఇలా వివాదం పెద్దదైంది. ఈ రెండు వర్గాల ఘర్షణతో నలుగురు గాయపడ్డారు. ఇంతలో గొడవ సంగతి తెలుసుకున్న పోలీసులు ముష్టూరు వచ్చారు. ఇరు వర్గాలను శాంతింప జేశారు.
ఈ ఘర్షణలో గాయపడిన నలుగుర్ని చికిత్స కోసం ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ కూడా మళ్లీ గొడవ మొదలైంది. వారి చర్యలతో ఆసుపత్రిలో అలజడి రేగింది. ఆసుపత్రి సిబ్బంది ఫిర్యాదుతో అక్కడ బాహాబాహీకి దిగిన వ్యక్తులను పోలీసులు స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండి:
బెట్టింగ్ వద్దన్నందుకు...విషం కలిపి తల్లి, చెల్లిని చంపేశాడు