A man facing problem with Anantapur MRO: కొనుగోలు చేసిన భూమిని తన పేరు మీద మ్యూటేషన్ చేసి పట్టదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని ఓ వ్యక్తి కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ తిరిగాడు. అతని బాధను చూసిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పందించారు. పాసుపుస్తకాలు ఇవ్వాలని గతంలోనే తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. అయినా తహసీల్దార్ స్పందించకుండా బాధితుడిని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.
వెంకటరమణ అనే ఓ స్థిరాస్తి వ్యాపారి రాయదుర్గం నియోజకవర్గం డి. హీరేహల్లో 40 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. దీనికి భూమి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని తహసీల్దార్‌కు తగిన ధృవపత్రాలతో దరఖాస్తు చేశారు. అన్నీ సరిగ్గానే ఉన్నాయని చెప్పిన తహసీల్దార్.. పట్టాదారు పాసుబుక్కు మాత్రం ఇవ్వడం లేదని బాధితుడు ఆరోపించాడు. ఏడాదిన్నర కాలంగా కలెక్టరేట్‌కు తిరుగుతూ.. స్పందనలో ఎనిమిదిసార్లు కలెక్టర్‌కు ఫిర్యాదులు చేసినట్లు వెంకటరమణ తెలిపారు. దీనిపై గతంలోనే కలెక్టర్ నాగలక్ష్మి తహసీల్దార్‌కు తగిన ఆదేశాలు జారీ చేసినా.. క్షేత్రస్థాయిలో అవి అమలు కాలేదని వెంకటరమణ పేర్కొన్నాడు. తమకు కలెక్టర్ చెబితే సరిపోదని.. ప్రజాప్రతినిధి చెబితేనే పాస్ బుక్కు వస్తుందని రెవెన్యూ అధికారులు నిర్మొహమాటంగా చెప్పేశారని బాధితుడు వెల్లడించారు. తన రికార్డు చూసి పాసుబుక్కు ఇవ్వాలని.. తాను ఎవరి దగ్గరకు వెళ్లేది లేదని చెప్పినట్లు తెలిపారు. చివరకు ఆ ప్రజాప్రతినిధి పేరు చెప్పి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని రెవెన్యూ అధికారి డిమాండ్ చేసినట్లు వెంకటరమణ ఆరోపించారు.
డబ్బులు ఇస్తేనే నీ పని చేయాలని ప్రజాప్రతినిధి దగ్గర నుంచి ఆదేశాలున్నాయని.. మండల రెవెన్యూ కార్యాలయం అధికారులు చెప్పినట్లు బాధితుడు ఆరోపిస్తున్నారు. ఎనిమిదోసారి ఫిర్యాదు చేయటానికి సోమవారం స్పందనకు వచ్చి, కలెక్టర్, జేసీలకు విషయం చెప్పటంతో మరోసారి జేసీ కేతన్ గార్గ్ డి.హీరేహాల్ రెవెన్యూ అధికారులకు ఫోన్ చేసి చెప్పారు. రెవెన్యూ అధికారులు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇవీ చదవండి: