MLC ELECTIONS CANDIDATES NOMINATIONS : అనంతపురం, చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలను ఏకగీవ్రం చేసుకోవడానికి.. వైఎస్సార్సీపీ పన్నిన వ్యూహాలు.. తెలుగుదేశం పార్టీ ఎత్తుగడలతో రివర్స్ అయ్యాయి. అనంతలో వైసీపీ అభ్యర్థి మంగమ్మకు పోటీగా.. తెలుగుదేశం నుంచి నామినేషన్లు దాఖలవకుండా సాగించిన యత్నాలు నీరుగారాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా.. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు, యాడికి మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య నామినేషన్ వేశారు. ఐతే.. విషయం తెలుసుకున్న వైసీపీ ప్రజాప్రతినిధులు.. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
నామినేషన్ పత్రాలు తీసుకున్న వారి వివరాల కోసం రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి టోకెన్ రిజిష్టర్ పరిశీలిచారు. పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ.. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించగా.. డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి అడ్డు చెప్పారు. వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం అభ్యర్థిని కిడ్నాప్ చేస్తారనే ప్రచారం సాగడంతో.. రంగయ్యను ప్రతిపాదించే అభ్యర్థులు బైక్‌లపై ఒక్కొక్కరుగా చేరుకున్నారు. రంగయ్యను.. జేసీ అనుచరుడు శ్రీకాంత్ కలెక్టరేట్ వెనకున్న శ్మశానవాటిక గోడ దూకి కార్యాలయ ఆవరణలోకి తీసుకొచ్చారు. వెనుక వైపు నుంచి తీసుకెళ్లి నామినేషన్ దాఖలు చేయించారు.
మరోవైపు చిత్తారులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైఎస్సార్సీపీ అభ్యర్థి సిపాయి సుబ్రహ్మణ్యం.. గురువారం మధ్యాహ్నం పన్నెండున్నరకు నామినేషన్ వేశారు. పోటీకి ఎవరూ రారని,.. ఆయన ఏకగ్రీవమయ్యారని..అధికార పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు కూడా చెప్పారు. ఐతే.. పంచాయతీరాజ్ ఛాంబర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ధనుంజయ్ యాదవ్.. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వస్తున్నారని.. అంతలోపే సమాచారం అందింది.
వైసీపీ MLC భరత్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి.. అక్కడే ఉన్నారు. ఈలోగా తెలుగుదేశం ఎమ్మెల్సీ దొరబాబు, నాయకులు సప్తగిరి ప్రసాద్, కోదండ యాదవ్‌లతో కలిసి.. ధనుంజయ్ యాదవ్ రిటర్నింగ్ అధికారి కార్యలయం వద్దకు వెళ్లారు. ఐతే.. కొందరు సిబ్బంది సమయం ముగిసిందని వారిని ఆపే ప్రయత్నం చేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకూ.. గడువుందని, దానికి ఇంకా 20 నిమిషాల సమయం ఉందని స్పష్టం చేయడంతో లోపలికి అనుమతించారు.
నామినేషన్ వేశాక ధనుంజయ్ యాదవ్‌ను కిడ్నాప్ చేయడానికి వైసీపీ శ్రేణులు పథకం వేశారని ఎస్పీ రిశాంత్‌రెడ్డికి తెలుగుదేశం నేతలు ఫోన్ చేశారు. దాంతో.. రెండో పట్టణ సీఐ మద్దయాచారి సిబ్బందితో వచ్చారు. ధనుంజయ్‌ను.. జీపులో ఎక్కించుకుని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అంతకుముందు.. వైసీపీ నాయకుల నుంచి తనకు రక్షణ కల్పించాలని డీఎస్పీ శ్రీనివాసమూర్తికి ధనుంజయ్ యాదవ్ వినతి పత్రం ఇచ్చారు.
ఇవీ చదవండి: