అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని మెచ్చిరి ఆంజనేయస్వామి ఆలయంలో ఘర్షణ చోటుచేసుకుంది. స్థానికులు, బాధితులు, పోలీసుల వివరాల మేరకు.. శనివారం గ్రామానికి చెందిన దళితులు రుద్రప్ప కుటుంబసభ్యులు స్వామివారి దర్శనానికి వెళ్లగా అర్చకులు అడ్డుకున్నారు. గమనించిన గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. లోపలికి ఎందుకు రానివ్వటం లేదని, ఆలయ తాళాలు ఇవ్వాలని గ్రామస్థులు కోరగా అర్చకులు తిరస్కరించారు. దేవాదాయ అధికారులకు ఇస్తామనటంతో వారి నడుమ ఘర్షణ జరిగింది. అర్చకులు లోకేష్, సత్యనారాయణ, రామమూర్తి కుమారులు సంజీవమూర్తి, అజిత్‌కుమార్, నిరంజన్, గ్రామస్థులు జయన్న, భీమప్ప తదితరులు గాయాలపాలయ్యారు. వారిని చికిత్స నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు గ్రామానికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో వేర్వేరుగా ఫిర్యాదులు చేసుకున్నారు. సీఐ ఈరణ్న దర్యాప్తు చేపట్టారు. ఆంజనేయస్వామి ఆలయ మాన్యం భూములపై అర్చకులకు, గ్రామస్థుల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. ఆలయానికి 25 ఎకరాల మాన్యం భూములు ఉన్నాయి. ప్రజల అభ్యర్థన మేరకు ఇటీవలే ఆలయాన్ని దేవాదాయశాఖ తమ పరిధిలోకి చేర్చుకుంది.
ఇదీ చదవండీ.. krmb, grmb: 'బోర్డుల సమావేశం వాయిదా వేయలేం'.. మరి తెలంగాణ హాజరవుతుందా?