అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని గుప్తా కాలనీలో తాళం వేసిన మూడు ఇళ్ళల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. శని,ఆదివారం పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమల్లో ఉన్న కారణంగా.. పామిడి ఎస్సై గంగాధర్ ఇంటికి తాళం వేసి బంధువుల ఇంట్లో వివాహానికి కుటుంబంతో సహా కలిసి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగులు.. ఎస్సై ఇంటికి ఆదివారం రాత్రి సమయంలో కన్నం వేశారు.
ఇంట్లోకి ప్రవేసించి బీరువా బద్ధలు కొట్టి దుస్తులు చిందవందరగా పడేశారు. బీరువాలో ఉన్న రూ: 70వేలు నగదును అపహరించారని ఎస్సై తెలిపారు. అదే వీధిలో ఉన్న ఉపాధ్యాయుడు రామాంజనేయులు, భవన నిర్మాణ కార్మికుడు నరేష్ ఇంటిలోనూ చోరీకి పాల్పడ్డారు.
మిగతా 2 ఇళ్ల యజమానులు అందుబాటులో లేకపోవటంతో ఎంత సొమ్ము పోయిందో పూర్తిగా తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాసులు.. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించి ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసు అధికారి ఇంటికే కన్నం వేస్తె ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రజలు భయబ్రాంతులకి గురవుతున్నారు.
ఇదీ చూడండి: