Chandrababu Comments in Gooty Public Meeting: జగన్‌పై తాను చేస్తున్న పోరాటం తన కోసం కాదని.. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికని చంద్రబాబు తెలిపారు. 'బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ' కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా గుత్తిలో పర్యటించారు. ఈ సందర్భంగా గుత్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీగా టీడీపీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
నా బలం, సైన్యం.. ప్రజలే: రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అంతా చేయి చేయి కలుపుదామని.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. తన బలం.. తన సైన్యం ప్రజలేనని అన్నారు. సైకో జగన్‌కు పోలీసులు, ధన బలం ఉండవచ్చని.. ఆ బలం కంటే మిన్న ప్రజాబలం.. తన సొంతమని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రశ్నిస్తే అరెస్టులు: ఒక్క ఛాన్స్ అని అంటే ఆ మాటలు నమ్మి మోసపోయామని.. అరాచక పాలన పోవాలంటూ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జగన్ ఇచ్చేది పది రూపాయలు.. దోచేది వంద రూపాయలని చంద్రబాబు విమర్శించారు. ఇసుక ధరలపై ప్రశ్నిస్తే అరెస్టు చేసి జైలులో పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు మాట్లాడే స్వేచ్ఛను కూడా హరించారని వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
యువగళం.. ప్రజాగళమై: లోకేశ్ చేస్తున్న యువగళం.. ప్రజాగళమై.. నేడు ప్రజా ఉద్యమంగా మారిందని అన్నారు. యువగళం వాలంటీర్లపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని.. అయినా సరే వెనక్కి తగ్గేదే లేదని పోరాటం కొనసాగిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ అరాచక పాలనపై తాను చేస్తున్న పోరాటానికి ప్రజలు సంఘీభావం తెలియజేయాలని కోరారు.
జీవితాల్లో వెలుగు తీసుకువస్తా: అధికారంలోకి వచ్చిన తరువాత టెక్నాలజీ ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకువస్తానని చంద్రబాబు తెలిపారు. సంపద సృష్టించి ప్రజలకు పంచే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. వ్యాపార కేంద్రమైన గుంతకల్లు పూర్వ వైభవం కోల్పోయిందని.. గుత్తి చెరువుకు నీళ్లు కూడా ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో హంద్రీనీవా జలాలు తీసుకువచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు.
Babu Surety Bhavishyathuku Guarantee: గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించి కియా పరిశ్రమ తెచ్చామని.. నేడు ఆ పరిశ్రమ ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయని అన్నారు. టీడీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 69 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని.. రాయలసీమకు 12 వేల కోట్లు ఖర్చు చేశామని.. జీడిపల్లి, మారాల, చెర్లోపల్లి, గొల్లపల్లి ప్రాజెక్టులు పూర్తిచేశామని చంద్రబాబు తెలిపారు. వైసీపీ హయాంలో 40 రోజులకోసారి నీళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇసుక సత్యాగ్రహం: స్థానికంగా లభ్యమయ్యే ఇసుకపై వైసీపీ నేతల పెత్తనమేంటని ప్రశ్నించారు. ఇసుక సత్యాగ్రహం చేపట్టి నిరసన తెలియజేయాలని.. ఇసుక ఉచితంగా ఇచ్చి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలించి దోచుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారని మండిపడ్డ చంద్రబాబు.. అనంతపురం జిల్లాలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని అన్నారు.
కొత్త విద్యుత్ విధానం తీసుకొస్తా: టీడీపీ హయాంలో సోలార్ పంపులు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఇళ్లపై సౌర విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని అదే విధంగా.. హైడ్రో, పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త విద్యుత్ విధానం తీసుకువస్తామని చంద్రబాబు తెలిపారు. పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారన్న చంద్రబాబు.. సంపద సృష్టిస్తా.. ఆదాయం పెంచి ప్రజలకు పంచుతాని హామీ ఇచ్చారు.