చేనేతలు పేదరికం, అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితుల్లో ఉన్నారని సీఎం జగన్ అన్నారు. ఆప్కో వ్యవస్థను ప్రక్షాళన చేసి చేనేత కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 24 వేలు అందించే నేతన్న నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 85 వేలమందికి రూ.24 వేలు చొప్పున అందజేస్తామని తెలిపారు. పాత అప్పులకు ఈ నగదు జమ చేయవద్దని బ్యాంకర్లకు సూచించారు. పేద వర్గాలకు మేలు చేస్తూ నవరత్నాలను అమలు చేస్తున్నామన్న సీఎం... జనవరి 9న అమ్మఒడి పథకాన్ని తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు.
అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగామని సీఎం జగన్ పేర్కొన్నారు. లక్షా 30 వేలమందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామన్నారు. సామాజిక న్యాయంతో పాటు ఆర్థిక న్యాయం కూడా జరగాలని తెలిపారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడకుండా అందరికీ న్యాయం చేస్తున్నామని అన్నారు.