పలు జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంది. కరోనా విస్తరిస్తున్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ తీసుకోవటానికి ప్రజలు బారులు తీరారు. కొన్ని చోట్ల కనీస సౌకర్యాలు కరవవగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లా...
అనంతపురం జిల్లా కేంద్రంలోని సర్వజనాసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు జనాలు బారులు తీరారు. రెండు రోజుల విరామం తర్వాత టీకా వేసే ప్రక్రియ ప్రారంభం కావడంతో జనాలు అధికమొత్తంలో జీజీహెచ్‌కు చేరుకున్నారు. వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద క్యూలైన్లలో భౌతిక దూరం పాటించేలా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
ప్రకాశం జిల్లా..
ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీలోని ప్రజలు వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు ఉత్సాహంగా అధిక సంఖ్యలో తరలివచ్చారు. వ్యాక్సిన్ కొరత కారణంగా ప్రజలకు నిరుత్సాహంగా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వ్యాక్సిన్ కొరత లేకుండా చేయాలని ప్రజలు కోరుతున్నారు.
కడప జిల్లా..
కడప జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలోని ఆర్టీసీ ఉద్యోగులకు నేడు కరోనా టీకా వేశారు. కడపలో 150 మందికి, మైదుకూరులో 45, పులివెందులలో 100, జమ్మలమడుగులో 300 మందికి టీకా వేశారు. కార్మికులకు టీకా వేయడం పట్ల కార్మిక సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
విశాఖపట్నం జిల్లా..
విశాఖ జిల్లాలోని టీకా కేంద్రాల వద్ద సరైన ఏర్పాట్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. టొకెన్లు ఇచ్చినప్పటికీ వ్యాక్సిన్ కేంద్రాలు సమయానికి తెరవక పోవటంతో ప్రజలు బారులు తీరి నిరీక్షించాల్సి వచ్చింది. మొదటి డోసు కొవాగ్జిన్ వేసుకున్న వారికి రెండో డోసు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదీ చదవండి