అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా శింగనమల మండలం చక్రాయపేట గ్రామ పొలాల్లో బుధవారం ఆయన పర్యటించారు. వర్షానికి తడిసిన వేరుశనగ పంటను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
చేతికి వచ్చే సమయంలో వేరుశనగ పంట వర్షాల కారణంగా తడిసి పనికిరాకుండా పోవటం బాధాకరం. బాధిత రైతులకు సాయం అందించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వచ్చి రైతులు స్థితిగతులను అడిగి తెలుసుకోవాలి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి పంట నష్టపోయిన కర్షకులకు... ఎకరానికి 25 వేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలి.
- నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి