AP Chief Minister Jagan Narpala tour: ''పేదల జీవితాల్లో పెను మార్పులను తీసుకొచ్చే చదువుకు.. రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. అందుకే 'జగనన్న విద్యా దీవెన'తో పాటు 'వసతి దీవెన' అనే పథకాలను తెచ్చాం. ఈ పథకం కింద 9 లక్షల 55వేల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి దాదాపు రూ. 913 కోట్లు జమ చేస్తున్నాం. పేద పిల్లలకు మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న ఈ ప్రోత్సాహంతో గత నాలుగేళ్లలో ఉన్నత విద్యను అభ్యసించేవారి సంఖ్య రెట్టింపు అయ్యింది. భవిష్యత్‌లోనూ విద్యార్థుల చదువుకు పెద్దపీట వేస్తాం. నాడు-నేడుతో తరగతి గదులను సరికొత్తగా తీర్చిదిద్దుతున్నాం. డిజిటల్ బోధన, పిల్లలకు ట్యాబ్‌ల పంపిణీ, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ సహా వివిధ రకాల కార్యక్రమాలతో విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తున్నాం'' అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
ఆ పథకం సరిపోవటంలేదని-ఈ పథకాన్ని తీసుకొచ్చాం.. అనంతపురం జిల్లా నార్పలలో నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి 'జగనన్న వసతి దీవెన' పథకం కింద రూ.912 కోట్లను బటన్ నొక్కి విద్యార్థుల ఖాతాలకు బదిలీ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. చదువు పేదరికం సంకెళ్లను తెంచుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో చదువు ప్రాధాన్యతను గుర్తించి మొదటగా 'జగనన్న విద్యా దీవెన' పథకాన్ని తీసుకొచ్చామన్న ఆయన.. ఆ పథకం సరిపోవటంలేదని 'జగనన్న వసతి దీవెన'ను ప్రవేశపెట్టమన్నారు. ఈ వసతి దీవెన ద్వారా నేడు దాదాపు రూ. 912 కోట్ల రూపాయలను విద్యార్థులకు అందేలా చేశామన్నారు.
చంద్రబాబును విమర్శించటమే లక్ష్యంగా... అయితే, అనంతపురం జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి 'జగనన్న వసతి దీవెన' కింద లబ్దిచేకూర్చే సభ ఎన్నికల సభను తలపించింది. ప్రభుత్వ పథకాల గురించి, వాటి ద్వారా ప్రయోజనం గురించి, రాష్ట్రంలో చేసిన అభివృద్ధి పనుల గురించి చెప్పాల్సిన ప్రభుత్వ సభ.. రాజకీయ రంగును పులుముకొని ప్రతిపక్ష పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విమర్శించటమే లక్ష్యంగా సాగింది. సభలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మళ్లీ రావాలంటూ, దేవుడు పుట్టిన గడియల్లో పుట్టిన జగనన్న అంటూ ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా విద్యార్థులతో నృత్యాలు చేయించారు.
జగన్ ప్రసంగిస్తుండగానే సభ నుంచి వెళ్లిపోయిన ప్రజలు.. గత సభల్లో ప్రజలు వెళ్లిపోవటం, కుర్చీలు ఖాళీ అవుతుండటంతో ఈసారి అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పద్మవ్యూహం తరహాలో సభ ప్రవేశాన్ని ఏర్పాటు చేసి, లోపలికి వెళ్లాక సులభంగా వెలుపలికి రావటానికి అవకాశం లేకుండా, మూడంచెల బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆరు అడుగుల ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేయటంతో పాటు, చుట్టూ పరదాలు కట్టి, సభలోకి వచ్చినవారు తిరిగి బయటకు వెళ్లకుండా అధికారులు కాపలా ఉన్నారు. అధికారులు, పార్టీ నాయకులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ సభలో జగన్ ప్రసంగిస్తుండగానే.. ప్రజలు బారికేడ్లను తోసేసి, పోలీసులు అడ్డుకుంటున్నా ఆగకుండా వెళ్లిపోయారు. ఈ క్రమంలో పూజిత అనే విద్యార్థిని బారికేడ్ దాటుతూ కిందపడి స్పృహ కోల్పోయింది. దీంతో తోటి విద్యార్థులు ఆమెను అత్యవసర వైద్య శిబిరానికి తీసుకెళ్లారు.
పులి కథ పేరుతో చంద్రబాబుపై విమర్శలు.. సీఎం జగన్ సభలో ప్రసంగిస్తూ.. గత ప్రభుత్వ హయంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 30 లక్షల మంది మాత్రమే చదువుతుండగా, తమ ప్రభుత్వం వచ్చాక 40 లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నారన్నారు. 2018-19లో రాష్ట్రంలో 87 వేల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ చేస్తుండగా, ప్రస్తుతం 1.20 లక్షల మంది అభ్యసిస్తున్నారని వెల్లడించారు. విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చేశామని, ఉద్యోగ, ఉపాధికి అనుగుణంగా పాఠ్యాంశాల్లో మార్పులు తెచ్చినట్లు తెలిపారు. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సత్య నాదెండ్ల ఒక్కరే సరిపోరని, ప్రతి ఒక్కరూ ఆయన స్థాయికి ఎదిగేలా చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు. చివరిగా ఓ పులి కథ చెప్పి.. అది చంద్రబాబు నాయుడుకి బాగా వర్తిస్తుందంటూ జగన్ విమర్శలు చేశారు.
ఇవీ చదవండి