అనంతపురం జిల్లా గుత్తి పురపాలిక ఎన్నికల్లో మాజీలు తమ పట్టును నిలుపుకొంటారా..? లేదా అన్న చర్చ జోరుగా సాగుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి మాజీ కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు పోటీలో నిలిచారు. గుత్తి, గుత్తి ఆర్.ఎస్., చెట్నేపల్లి, సూరశింగనపల్లిలో 25 వార్డులు ఉన్నాయి. వాటిలో ఆరు వార్డుల్లో పోటీదారులు ఉపసంహరించుకోవడంతో వైకాపాకు చెందిన అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన 19 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు.
మూడో వార్డులో మాజీ కౌన్సిలర్ వరలక్ష్మి మళ్లీ వైకాపా తరపున ఎన్నికల బరిలో నిలిచారు. 4వ వార్డులో రమేష్‌బాబు గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఇప్పుడు మళ్లీ ఇండిపెండెంట్‌గా పోటీచేశారు. 8వ వార్డులో మాజీ కౌన్సిలర్ మస్తాన్‌బీ తెదేపా తరఫున పోటీ చేశారు. 13వ వార్డులో మాజీ కౌన్సిలర్ మర్తాడు హసీనా బరిలో నిలిచారు. 12వ వార్డులో మాజీ కౌన్సిలర్ నజీర్ పోటీచేశారు. 25వ వార్డులో మాజీ కౌన్సిలర్ కొనకొండ్ల ప్రమీల వైకాపా తరపున బరిలో ఉన్నారు. 17వ వార్డులో మాజీ కౌన్సిలర్ పర్వీన్ పోటీ చేశారు. మరో మాజీ కౌన్సిలర్ సుజాత ఈసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పోటీలో ఉన్న పలువురు మాజీలు తాము వార్డుల్లో అభివృద్ధి పనులు చేయించామని, సమస్యలను పరిష్కరించేందుకు కౌన్సిల్ సమావేశాల్లో అధికారులను, అప్పటి అధికార పక్షాన్ని నిలదీశామని అంటున్నారు. ప్రజల్లో తమకు ఆదరణ ఉండటంతోనే మళ్లీ పోటీ చేశామని చెబుతున్నారు. వీరిలో ఎందరు గెలిచి కౌన్సిల్‌లో అడుగుపెడతారో తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు వేచిచూడాల్సిందే.
కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఇలా...
పురపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం ఉన్నవారిని కౌన్సిల్ కో-ఆప్ట్ చేస్తుంది. అలాంటివారిలో నగర పంచాయతీ నుంచి ఒకరిని, మూడు లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీ నుంచి ఇద్దరిని, మూడు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న పురపాలికల నుంచి ముగ్గురిని కౌన్సిల్ కో-ఆప్ట్ చేస్తుంది. సంబంధిత మున్సిపాలిటీలో ఓటరుగా నమోదై 21 ఏళ్ల కంటే తక్కువ కాని వయసున్న వ్యక్తిని మైనారిటీ వర్గాల నుంచి సభ్యునిగా ఎన్నుకుంటారు. ఆ వ్యక్తి కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొని మాట్లాడవచ్ఛు వారికి ఓటు హక్కు ఉండదు.
పురపాలక సంఘాన్ని అనుసరించి వేతనాలు
పురపాలక ఛైర్మన్లు, కౌన్సిలర్ల వేతనాలు వారు ప్రాతినిథ్యం వహించే పురపాలక సంఘాన్ని అనుసరించి ఉంటాయి. సెలెక్షన్ గ్రేడ్, స్పెషల్ గ్రేడ్ పురపాలక ఛైర్మన్లకు నెలకు రూ.10వేలు, ఫస్ట్ గ్రేడ్, సెంకడ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ ఛైర్మన్ల వేతనం రూ.8వేలు ఉంటుంది. స్పెషల్, సెలెక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్లకు రూ.5వేలు, మిగతావాటికి రూ.3,200 నిర్ణయించారు. కౌన్సిలర్ గౌరవ వేతనం సెలెక్షన్, స్పెషల్ గ్రేడ్ స్థాయిలో రూ.2,200, పస్ట్ గ్రేడ్ స్థాయిలో రూ.1800, సెంకడ్ గ్రేడ్ రూ.1400, థర్డ్ గ్రేడ్‌లో రూ.1000 ఉంటుంది.
నలుగురు తాత్కాలిక వైస్ ఛైర్మన్లకు అవకాశం..
పురపాలక సంస్థల్లో నిర్వహించే ప్రతి సమావేశానికి ఛైర్మన్ అధ్యక్షత వహించాలి. ఆయన అందుబాటులో లేనప్పుడు వైస్ ఛైర్మన్ ఆ బాధ్యత చూస్తారు. వారిద్దరూ హాజరుకానప్పుడు క్లాజ్(బి)ఉదహరించిన మేరకు తాత్కాలిక వైస్ ఛైర్మన్‌గా జాబితాలో నమోదైన సభ్యుడు అధ్యక్షత వహిస్తారు. తాత్కాలిక వైస్ ఛైర్మన్ లేనప్పుడు సమావేశంలో పాల్గొన్న సభ్యుల్లో ఒకరిని అప్పటికప్పుడు ఎన్నుకుని అధ్యక్షస్థానంలో ఉంచి సభ నిర్వహించవచ్ఛు ప్రతి సంవత్సరం కౌన్సిల్ మొదటి సమావేశంలో ఎన్నికైన సభ్యుల నుంచి నలుగురికి మించకుండా తాత్కాలిక వెస్ ఛైర్మన్ల ప్యానెల్‌కు పేర్లు సూచించే బాధ్యత ఆయా పురపాలక సంఘం చైర్మన్లకి ఉంటుంది.
కౌన్సిలర్ పదవికి భలే క్రేజీ!
గుంతకల్లు మున్సిపాలిటీలో కౌన్సిలర్ పదవికి ప్రత్యేక క్రేజీ ఉంది. ఇక్కడ కౌన్సిలర్‌లుగా గెలుపొందిన వారు ఆ తర్వాత కాలంలో పలువురు ఎమ్మెల్యేలు అయ్యారు. కొంత రాజకీయ నేపథ్యం ఉన్నవారు ఎమ్మెల్యే పదవులను చేపట్టారు. గతంలో కౌన్సిలర్లు అయిన పత్తి రాజ్‌గోపాల్, గాది లింగప్ప, జగదీష్, ఆర్.సాయినాథ్‌గౌడ్ ఎమ్మెల్యేలు అయ్యారు. గాది లింగప్ప కుమార్తె నీలావతికి రాజకీయ నేపథ్యం ఉండటంతో ఆమె కౌన్సిలర్‌గా ఎన్నిక కాకపోయినా ఎమ్మెల్యే పదవిని చేపట్టారు. మధుసూదన్ గుప్త ఇదేవిధంగా ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతం మున్సిపల్ అధ్యక్ష పీఠం కోసం దివంగత మాజీ ఎమ్మెల్యే సతీమణి వెంకటలక్ష్మి, సమీప బంధువైన భవాని తీవ్రంగా పోటీపడుతున్నారు. వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి వైకాపా నాయకులు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రాకపోవడంతో ఈ విషయం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: ఆశా వహులు వీరు అందల మెక్కేదెవరు !