కుటుంబ సమస్యలు తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించిన ఓ అడ్వొకేట్ను అనంతపురం త్రీటౌన్ పోలీసులు రక్షించారు. స్థానిక కమలానగర్ కు చెందిన అడ్వొకేట్ విష్ణువర్ధన్ గత కొంతకాలంగా కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో మంగళవారం అర్ధరాత్రి స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఓ లాడ్జి అద్దెగదిలో మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులకు వీడియో కాల్ ద్వారా ఆత్మహత్యకు పాల్పడుతున్నానని సమాచారం ఇచ్చాడు. అప్రమత్తమైన కుటుంబసభ్యులు...వెంటనే డయల్ -100కు ఫోన్ చేసి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న డీఎస్పీ వీరరాఘవరెడ్డికి వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారు. విష్ణువర్ధన్ లోకేషన్ తెలియక నైట్ అలెర్ట్ , బీట్స్ , బ్లూకోల్ట్స్ , రక్షక్ సిబ్బందికి డీఎస్పీ సమాచారం పంపారు. వీడియో కాల్ షేర్ ఫోటోలను బట్టి ఏదో లాడ్జిలో ఉన్నట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. పట్టణంలోని లాడ్జీల్లో తనిఖీలు చేపట్టారు. ఆర్టీసీ బస్టాండులోని ఓ లాడ్జిలో ఆ అడ్వొకేట్ బస చేసినట్లు కనుగొని అక్కడికి చేరుకున్నారు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ఎక్కడ ఆత్మహత్యకు యత్నించాడనే విషయం తెలియకపోయినా సత్వరమే అతని ఆచూకీ కనుగొని ప్రాణాలు కాపాడిన అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, ఇటుకలపల్లి సీఐ విజయభాస్కర్ గౌడ్, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు అభినందించారు.
ఇదీ చదవండి