అనంతపురం జిల్లా కదిరిలో తెదేపా నాయకులను పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ అనంతపురం వెళ్తున్నట్లు సమాచారం అందినందునే గృహ నిర్బంధంలో ఉంచుతున్నట్లు పోలీసులు తెలిపారు. తెదేపా ముఖ్యనేతలు అచ్చెన్ననాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిలను వేర్వేరు ఆరోపణల్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నాయకుల అరెస్టును వ్యతిరేకిస్తూ... రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణులు నిరసనలు చేపడుతున్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను పరామర్శించేందుకు చంద్రబాబు వస్తున్నట్లు సమాచారం అందటంతో మాజీ శాసనసభ్యుడు అత్తార్ చాంద్ బాష, ఆ పార్టీ నేత మనోహర్ నాయుడుని గృహనిర్భందంలో ఉంచారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై విపక్షాలు నిరసన తెలియచేయటం మామూలేనని చాంద్ బాషా స్పష్టం చేశారు. జగన్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా కక్షపూరిత చర్యలను మానుకోవాలని హితువు పలికారు.